శనివాడ.. తరలింపు పీడ
ముక్కలు చెక్కలైన చిన్న గ్రామం బంధుత్వాలు.. ఆస్తులు.. చెల్లాచెదురు.. 1993లో స్టీల్‌ప్లాంట్ కోసం సగం గ్రామం తరలింపు ఇప్పుడు హిందుజా ప్లాంట్ కోసం ఆ సగంలో సగానికి తరలింపు సెగమమ్మల్ని ఎన్నిసార్లు విడగొడతారని బాధితుల ఆగ్రహం
అదో చిన్న ఊరు.. పేరు శనివాడ.. ఒకప్పుడు అక్కడ 136 గడపలు.. 514 జనాభా ఉండేది... కానీ ఇప్పుడక్కడ 56 గడపలే మిగిలాయి.. కారణం.. స్టీల్‌ప్లాంట్ భూసేకరణ పేరుతో 80 కుటుంబాలను తరలించారు.. చచ్చీ చెడీ ఈ కుటుంబాలు పునరావాస కాలనీలో స్థిరనివాసాలు ఏర్పరచుకున్నాయి.. ఇప్పుడు వీటిలో సగం కుటుంబాలకు మళ్లీ తరలింపు పీడ పట్టుకుంది.. పదేళ్లుగా వెంటాడుతూ.. భయపెడుతోంది.. హిందుజా పవర్‌ప్లాంట్‌కు రైల్వేట్రాక్ నిర్మాణం కోసం వీటిలో సగం ఇళ్లను స్వాధీనం చేసుకునేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.. ఏమిటీ పీడ.. ఎన్నిసార్లు మమ్మల్ని తరలిస్తారు?.. ఇప్పటికే గ్రామం ముక్కలైంది.. బాంధవ్యాలు తెగిపోయాయి.. ఇప్పటికైనా మమ్మల్ని ఒకచోట ప్రశాంతంగా బతకనీయరా?.. అని నిర్వాసిత కాలనీ ప్రజలు ఆవేదనతో ప్రశ్నిస్తున్నారు.
అగనంపూడి: విశాఖ స్టీల్‌ప్లాంట్ మలిదశ భూసేకరణలో భాగంగా 56వ వార్డు అగనంపూడికి సమీపంలోని శనివాడ గ్రామంలోని భూమలను అధికారులు సేకరించారు. అప్పట్లో గ్రామంలో 136 కుటుంబాలు.. 514 మంది ప్రజలు ఉండేవారు. వీటిలో 80 ఇళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కుటుంబాలు అతికష్టం మీద 1993లో సెక్టార్-3లో దిబ్బపాలెం రైల్వేట్రాక్ వద్ద పునరావాసం కల్పించారు. మిగిలిన కుటుంబాలు మాత్రం పాత శనివాడలోనే ఉంటున్నాయి. కాగా మలిదశ సేకరణ కారణంగా ఈ గ్రామ నిర్వాసితులు ఉద్యోగావకాశాలకు నోచుకోలేదు. ఎలాగోలా ఇళ్లు కట్టుకొని స్థిరనివాసం ఏర్పరచుకున్నారు.
హిందుజా పవర్ ప్లాంట్ నిర్మాణంతో వారిని మళ్లీ తరలింపు భయం వెంటాడుతోంది. ఈ ప్లాంట్‌కు అవసరమైన రైల్వ ట్రాక్ నిర్మాణానికి భూమి కోసం ఈ 80 కుటుంబాల్లోని 40 కుటుంబాలను వేరే ప్రాంతానికి తరలించే ప్రతిపాదన పదేళ్ల క్రితం తెరపైకి వచ్చింది. అధికారులు సర్వేలు, మార్కింగులు చేయడం కూడా ప్రారంభించడంతో కాలనీవాసులు హైకోర్టును ఆశ్రయించారు. దాంతో అప్పట్లో సర్వే ఆపేశారు. రెండేళ్ల నుంచి మళ్లీ భూసేకరణ సన్నాహాలు మొదలవడంతో కాలనీవాసుల్లో అలజడి రేగుతోంది. పది రోజుల క్రితం కూడా రైల్వే, హిందుజా సంస్థల అధికారులు వచ్చి సర్వే చేశారు. విశాఖ ఉక్కు కోసం ఒకసారి ఆస్తులు, ఇళ్లు త్యాగం చేశాం. ఇప్పుడు హిందుజా పవర్ ప్లాంట్ కోసం మళ్లీ త్యాగాలు చేయమంటే ఎలా?.. మేమేమైనా సంచార జీవులమా అని స్థానికులు ఆందోళనతో ప్రశ్నిస్తున్నారు. ఎన్నిసార్లు తరలిస్తారు.. ఎన్నిసార్లు విడగొడతారని అడుగుతున్నారు.
ఇప్పటికే బతుకులు దయనీయం
ఉన్న కొద్దో గొప్పో భూమి సాగు చేసుకొని రైతు బిడ్డలుగా ఠీవీగా బతికిన శనివాడ నిర్వాసితుల బతుకులు తరలింపు పుణ్యమా అని ఇప్పటికే దయనీయంగా మారాయి. విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు భూములు ఇస్తే ఇళ్లతోపాటు ఉద్యోగం వస్తుందని ఆశపడ్డారు. కానీ వారి ఆశలు అడియాశలయ్యాయి. నిర్వాసితుల్లో ఒకరిద్దరు మినహా ఎవరికీ ఉద్యోగాలు రాలేదు. దీంతో కూలి పనులు చేస్తూ కుటుంబాలను నెట్టుకొస్తున్నారు. ఇళ్లలోని పురుషులు, మహిళలు దినసరి కూలీలుగా మారడం ఒక ఎత్తయితే.. కాలనీకి పది మీటర్ల దూరంలోనే ఎన్టీపీసీ కోసం ప్రత్యేకంగా వేసిన రైల్వే ట్రాక్ వారి జీవితాల్లో ప్రశాంతతను చెదరగొట్టింది. ఇళ్లను శిథిలం చేసింది. రైళ్ల రాకపోకల శబ్దాలతో పగలూ రాత్రి తేడా లేకుండా ఇబ్బంది పడుతున్నారు. రాత్రి వేళల్లో కంటి మీద కనుకు కష్టంగా ఉంది. కొత్తవారెవరైనా వస్తే రెప్పవాలే పరిస్థితే లేదు. మరోవైపు రైళ్ల రాకపోకల ధాటికి దాదాపు అన్ని ఇళ్ల గోడలు బీటలు వారాయి. ప్రతి రెండేళ్లకోసారి వాటికి మరమ్మతులు చేయించడం, పుట్టీలు పెట్టించడంతోనే సరిపోతోంది.
హిందుజాతో భయం
హిందుజా ప్లాంట్‌కు రైల్వే ట్రాక్ నిర్మాణానికి అవసరమైన భూమి కోసం శనివాడ నిర్వాసిత, ఎస్సీ కాలనీకి చెందిన 40 ఇళ్లు ఖాళీ చేయాల్సిన పరిస్థితి ఉంది. రెండున్నర దశాబ్దాల క్రితం గ్రామాన్ని, బంధువులను, ఆస్తులను వదిలి సగం మంది ఇక్కడికి రావడం.. అలా వచ్చిన వారిలో సగం మంది మళ్లీ ఇక్కడి నుంచి వేరే చోటుకు వెళ్లాల్సిన పరిస్థితి బాధితుల్లో అలజడి రేపుతోంది. ఎస్సీకాలనీలోనూ ఇదే పరిస్థితి ఉంది. తరలించడ తప్పనిసరైతే.. మొత్తం కాలనీని తరలించాలని, అలాగే తాము సూచించిన ప్రాంతంలో పునరావాసం కల్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే తమ పరిస్థితి సంచార జీవుల్లా తయారైంది. భవిష్యత్‌లో ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ఒకేచోటుకు తరలించాలి లేదా తమ గ్రామం జోలికి రావద్దని వారు హెచ్చరిస్తున్నారు.
కాలనీ మొత్తాన్ని తరలిస్తే అభ్యంతరం లేదు...
పదేళ్ల క్రితం హైకోర్టును ఆశ్రయించడంతో ట్రాక్ నిర్మాణ పనులు ఆపేశారు. ఇప్పుడు మళ్లీ మాకు పని కల్పిస్తున్నారు. విశాఖ స్టీల్‌ప్లాంట్ వల్ల ఒకప్పుడు, హిందుజా సంస్థ వల్ల ఇప్పుడు నిర్వాసితులుగా మారే పరిస్థితి ఏర్పడింది. గతంలో గ్రామంలో సగం మందికే ఇక్కడ పునరావాసం కల్పించడంతో గ్రామానికి దూరమయ్యాం. ఇప్పుడు కూడా సగం గ్రామాన్ని సేకరిస్తే ఒప్పుకొనేది లేదు. మొత్తం కాలనీ అంతటిని తరలించాలి. -గొంతిన గోపి, నిర్వాసిత నాయకుడు
రోజూ టెన్షనే...
అప్పట్లో ట్రాక్ పక్కకు మమ్మల్ని తరలించారు. అప్పట్లో వద్దన్నా పట్టించుకోలేదు. 24 సంవత్సరాల క్రితం ఇక్కడికి వచ్చి ఇళ్లు కట్టుకొని ఉంటున్నాం. నిత్యం శబ్దాల నడుమ నివసిస్తున్నాం. మళ్లీ పవర్‌ప్లాంట్ ట్రాక్ పేరుతో వేరే చోటుకి వెళ్లమంటే ఎలా. ఎన్నిసార్లు నిర్వాసితుల అవతారమెత్తాలి. -కరణం వెంకటేష్, శనివాడ కాలనీ
ఎన్నిసార్లు అడుకుంటారు
మా జీవితాలతో ఆడుకోవద్దు. అప్పుడు స్టీల్‌ప్లాంట్ నిరాశ్రయుల్ని చేసింది. ఇప్పుడు హిందుజా రోడ్డున పడేయాలని చూస్తోంది. సర్వేలతో ఇబ్బంది పెడుతున్నారు. గ్రామం మొత్తాన్ని మేం కోరుకున్న చోటుకి తరలిస్తామంటేనే అంగీకరిస్తాం. -గొంతిన రమణమ్మ, కాలనీ