జాతీయ గీతానికి గౌరవమివ్వని టీచర్‌కు జరిమానా!
టోక్యో: జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చున్న ఉపాధ్యాయురాలి జీతంలో కోత విధించింది జపాన్ కోర్టు. 2013 జపాన్‌లో ఒక స్నాతకోత్సవంలో జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో కూర్చున్నందుకుగాను హిరాకో షింజూ అనే ఉపాధ్యాయురాలికి విద్యాధికారులు ఈ శిక్ష విధించారు. అధికారుల చర్యను సవాలు చేస్తూ షింజూ కోర్టుకెళ్లగా... జీతంలో కోత విధించడం సమర్థనీయమేనని ఒసాకా జిల్లా కోర్టు తీర్పు వెలువరించింది.
జాతీయ గీతం ఆలపిస్తున్న సమయంలో నిలబడాలంటూ రాజ్యాంగంలో ఎటువంటి నిబంధన లేదని, అయితే ఇటువంటి చర్య పాఠశాల క్రమశిక్షణను ఉల్లఘించినట్లే అవుతుందని న్యాయమూర్తి హిరోయోకి నైటో అన్నారు. ఇదిలాఉండగా... జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో నిలబడాలంటూ ఎలాంటి నిబంధనలు లేవని జపాన్ సుప్రీంకోర్టు 2012లో తీర్పునిచ్చింది. అయినా టోక్యో జిల్లా కోర్టు గత సంవత్సరం దీనిపై టీచర్లకు జరిమానాలు విధించింది. దీనిపై జపాన్‌లో పలుమార్లు ఉపాధ్యాయ సంఘాలు, యాజమాన్యం మధ్య గొడవలు కూడా తలెత్తాయి. దీంతో జపాన్‌లో ప్రత్యేకంగా ఇందుకోసం ఓ చట్టం తీసుకొచ్చారు. జాతీయగీతం ఆలపిస్తున్న సమయంలో ప్రైమరీ టీచర్లతోపాటు, యూనివర్సిటీ సిబ్బంది కూడా నిలబడాలని జపాన్ ప్రధాని షింజో అబే పార్లమెంటులో చట్టం తీసుకొచ్చారు.