రాష్ట్ర స్థాయి హాకీ చాంపియన్ అనంత
అనంతపురం స్పోర్ట్స్ : 5వ రాష్ట్రస్థాయి అన్నేఫై హాకీ చాంపియన్‌షిప్‌ను అనంతపురం జట్టు కైవసం చేసుకుంది. అనంత క్రీడా గ్రామంలో ఆదివారం జరిగిన ఫైనల్ పోటీలో అనంతపురం, తూర్పుగోదావరి జట్లు పోటీపడ్డాయి. ‘అనంత’ జట్టు 5-0 గోల్స్ తేడాతో తూర్పు గోదావరిపై ఘనవిజయాన్ని సాధించింది. జట్టులో ఏ మహాలక్ష్మి 2, ఎస్ మహాలక్ష్మి 2, గీత 1 గోల్ చేశారు. తూర్పుగోదావరి జట్టు ఏ దశలోనూ గట్టిపోటీ ఇవ్వలేకపోయింది. విజయం సాధించగానే తోటి క్రీడాకారులు హాకీ స్టిక్‌లను పట్టుకుని సందడి చేశారు.
మూడోస్థానంలో విశాఖ : విశాఖపట్టణం, నెల్లూరు జట్టు మూడోస్థానం కోసం పోటీపడ్డాయి. ఈ మ్యాచ్ ఏకపక్షంగా సాగింది. వైజాగ్ జట్టు 3-0 గోల్స్ తేడాతో విజయాన్ని సాధించి మూడో స్థానంలో నిలిచారు. జట్టులో మేరి 2, పూజిత 1 గోల్ చేశారు.
ఏపీ నెంబర్‌వన్ స్థాయికి చేరాలి : ఆర్డీటీ చైర్మన్ తిప్పేస్వామి
దేశంలోనే ఏపీ హాకీ నెంబర్‌వన్ స్థాయికి చేరాలని ఆర్డీటీ ఛైర్మన్ తిప్పేస్వామి ఆకాంక్షించారు. ఆదివారం అనంత క్రీడా గ్రామంలో జరిగిన ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని క్రీడాకారిణిలను బహుమతులనందజేశారు. సమష్టిగా ఆడితే తప్పక విజయం వరిస్తుందన్నారు. హాకీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పక్కా ఆర్గనైజేషన్ల క్రీడా పోటీల్లోనే పాల్గొనాలన్నారు.
డీఎస్డీఓ శ్రీనివాస్ కుమార్ మాట్లాడుతూ ప్రతిభ కల్గిన క్రీడాకారులకు ప్రత్యేక క్యాంపులను నిర్వహించాలన్నారు. ఆర్డీటీ స్పోర్ట్స్ డెరైక్టర్ జేవీయర్ మాట్లాడుతూ ఆర్డీటీ షూటింగ్‌కు సంబంధించి గగన్‌నారంగ్ అకాడమీ, దీపికా కుమారి ఆర్చరీ అకాడమీల నుంచి కోచ్‌లను తీసుకువస్తామన్నారు. కార్యక్రమంలో హాకీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబాన్ బాష, సాప్ నుంచి పీ మురళీధర్, హాకీ సంఘం కార్యదర్శి డాక్టర్ విజయబాబు, కోశాధికారి బాబయ్య, కోచ్ చౌడేశ్వర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.