మనసున్న నటి
మానవత్వం ఉన్నవాళ్లను మహానుభావులని అంటారు. దయ గల హృదయం ఉంటే కొందరు నిర్భాగ్యులకు చేయూత దొరుకుతుంది. అలాంటి మంచి మనిషిగా నటి హన్సికను పేర్కొనవచ్చు. ఒక పక్క తన నటనా ప్రతిభతో సినీ ప్రేక్షకుల్ని సంతోపరుస్తూనే మరో పక్క తన కరుణ హృదయంతో అనాథలను చేరదీసి అక్కున చేర్చుకుంటున్న మానవతావాది నటి హన్సిక. పిన్న వయసులోనే ఉన్నత మనస్థత్వంతో సమాజ సేవ చేస్తున్నారు. ప్రస్తుతం 25 మంది అనాథలకు విద్యాదానం, ఇతర సంరక్షణ బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారు. తాజాగా వారికంటూ ఒక గూడు ఏర్పాటు చేయడానికి సన్నద్ధం అయ్యారు. ఇందు కోసం తాను నటిస్తున్న చిత్ర పారితోషికం మొత్తాన్ని ఖర్చుపెట్టనున్నారు. ఆమె ప్రస్తుతం దుర్గ అనే తెలుగు చిత్రంలో నటిస్తున్నారు.
ఈ చిత్ర ప్రారంభోత్సవ కార్యక్రమం ఇటీవల ప్రారంభమైంది. ఈ చిత్రానికి తీసుకుంటున్న రూ.25 లక్షల పారితోషికాన్ని ఆశ్రమం నిర్మించడానికి కేటాయించడం విశేషం. ముంబయిలో కట్టనున్న ఈ ఆశ్రమం కోసం ఆమె స్థలం కొనుగోలు చేసే పనిలో ఉన్నారట. ఇక నటన విషయానికొస్తే ఈ బ్యూటీ తమిళం, తెలుగు భాషల్లో క్రేజీ హీరోయిన్గా వెలుగొందుతున్నారు. ఈ భామతో జతకట్టడానికి యువ హీరోలు పోటీ పడుతున్నారు. అందు కు కారణం ఇంతకుముందు కాస్త బొద్దుగా ఉన్న హన్సిక తాజాగా ఎనిమిది కిలోల బరువు తగ్గి స్లిమ్‌గా తయారయ్యా రు. చక్కనమ్మ చిక్కినా అందమే అనే సామెత హన్సికకు చక్కగా నప్పుతుంది.