మధ్యాహ్నభోజనం తిని..
మెదక్ రూరల్ : మధ్యాహ్న భోజనం తిన్న 60 విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన కూచన్‌పల్లి ఉన్నత పాఠశాలలో సోమవారం చోటుచేసుకుంది. బాధిత విద్యార్థుల కథనం ప్రకారం... మెదక్ మండలం కూచన్‌పల్లి జెడ్పీహెచ్ఎస్లో సుమారు 376 మంది విద్యార్థులు చదువుతున్నారు. రోజులాగే సోమవారం మధ్యాహ్న భోజనం తిన్న అనంతరం 3 గంటల సమయంలో తలతిరగడం, వాంతులు, విరేచనాలతో సుమారు 60 మంది విద్యార్థులు పడిపోయారు.
ఉపాధ్యాయులు హుటాహుటిన పక్కగ్రామంలో గల ముత్తాయికోటలోని ఓ ఆర్ఎంపీ పిలిపించి చికిత్స చేయించారు. అనంతరం పిల్లలను ఇళ్లకు పంపారు. అయినప్పటికీ వాంతులు, విరేచనాలు అదుపులోకి రాకపోవడంతో పలువురి పరిస్థితి విషమించింది. గమనించిన విద్యార్థుల తల్లిదండ్రులు హుటాహుటిన 108 అంబులెన్స్‌లో మెదక్ ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు.
ఉపాధ్యాయులపై మండిపడిన పిల్లల తల్లిదండ్రులు
పిల్లలు వాంతులు, విరేచనాలు చేసుకుంటే తమ దృష్టికి తీసుకురాకుండా ఆర్ఎంపీతో చికిత్స చేయిస్తారా అంటూ వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులపై మండిపడ్డారు. మధ్యాహ్న భోజనం నాణ్యత లేకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మెదక్ ఆర్డీఓ మెంచు నగేశ్, తహసీల్దార్ అమీనొద్దీన్, ఎంఈఓ నరేశ్ ఏరియా ఆసుపత్రిని సందర్శించి విద్యార్థులను పరామర్శించారు.
అస్వస్థతకు గురవడానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటర్వెల్ సమయంలో కొంతమంది విద్యార్థులు ఐస్‌క్రీమ్ తినడం వల్లే అస్వస్థతకు గురయ్యారని ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్ చెబుతున్నారు. తాము ఐస్‌క్రీమ్ తినకపోయినా అస్వస్థతకు గురయ్యామని పలువురు విద్యార్థులు పేర్కొంటున్నారు.