మిస్టర్ కరీనా
ఉద్యోగం పురుష లక్షణం అంటారా?
అంటారా?!
ఇంకో రకంగా కూడా ఉంటారా?
‘ఉంటారు’ అంటోంది కరీనా.
లడకీలో ‘కీ’, లడకా లో ‘కా’ తీసుకుని
‘కీ అండ్ కా’ సినిమాలో... ‘ఉద్యోగం మహిళ లక్షణం’ అని
ఈ నాయిక ప్రూవ్ చేసింది.
ఇక మిగిలిందేంటి?
ఓ సవాలు. ఓ ఛాలెంజ్.
ఎవరికి? అబ్బాయిలకు!
ఎక్కడ? ఇంట్లో... వంటింట్లో!
మరి.. తెలుగు అబ్బాయిలు కూడా వంటలు, వగైరాలు
చేసుకుంటూ మిస్టర్ భార్య చేతుల మీదుగా జీతం
పుచ్చుకోగలరంటారా? చదవండి. కరీనాతో సాక్షి ‘ఫ్యామిలీ’ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.
హాయ్ కరీనా... తెలుగు పత్రికకకు ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వడం బహుశా మీకిదే మొదటిసారి అయ్యుంటుందేమో?
అవును కరెక్టే. తెలుగులో మాత్రం మాట్లాడమని అడగొద్దు. నాకు ఒక్క ముక్క కూడా తెలియదు (నవ్వుతూ).
ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొనడానికి హైదరాబాద్ వస్తుంటారు కదా.. ఇక్కడి మీడియా మీకెలా అనిపిస్తుంది?
వెరీ ఫ్రెండ్లీ. ఆల్మోస్ట్ అందరూ స్మైలీ ఫేస్‌తోనే ఉంటారు. అందుకే హైదరాబాద్‌లో ప్రమోషనల్ యాక్టివిటీస్ అంటే నాకు హుషారుగానే ఉంటుంది.
ఇలా హిందీ సినిమాల ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చి, వెళ్లడం తప్ప తెలుగు సినిమాల్లో నటించరా ఏంటి?
(నవ్వుతూ) సౌత్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. భాష తెలియకుండా నటించడం కష్టం. అందుకే ఒప్పుకోలేదు. మంచి మంచి అవకాశాలే వచ్చాయి.
నార్త్ నుంచి ఎంతోమంది నాయికలు ఇక్కడ వెలిగిపోతున్నారు. వాళ్లకు కూడా భాష తెలియదు కదా?
ఎవరి ఇష్టం వాళ్లది. నా మటుకు నాకు భాష తెలియకపోతే సరిగ్గా హావభావాలు పలికించలేను. మనం ఏం చెబుతున్నామో దాని అర్థం తెలియకపోతే ఎలా? అక్కడక్కడా ఏదో కొంత తెలుసుకుని నటించడం నా వల్ల కాదు.
ఓకే.. హైదరాబాద్ గురించి నాలుగు మాటలు చెబుతారా?
ఇది చాలా పెద్ద సిటీ. ముందుగా నాకు నచ్చింది అదే. షాపింగ్ ఏరియాలు రద్దీగా ఉన్నప్పటికీ.. మిగతా ఏరియాలు దాదాపు కూల్‌గానే ఉంటాయి. అందుకే నాకు ఇక్కడ షూటింగ్స్ చేయడం చాలా ఇష్టం. ముఖ్యంగా ఫలక్‌నుమా ప్యాలెస్‌ను చాలా ఇష్టపడతాను.
నాయికగా 16 ఏళ్లుగా ఫిజిక్నెలా మెయిన్టైన్ చేస్తున్నారు?
యోగా చేస్తాను. ఇంకా జిమ్‌లో వర్కవుట్స్ ఎలానూ ఉంటాయి. మన శరీరం బరువు పెరగడానికి ఓ కారణం సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడమే. బ్రేక్‌ఫాస్ట్ నుంచి డిన్నర్ వరకూ మనం ఏ తీసుకున్నా టైమ్ ప్రకారమే తీసుకోవాలి. నేనలానే చేస్తాను.
ఓకే.. ఏప్రిల్ 1న విడుదల కానున్న ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్ హౌస్ హజ్బెండ్‌గా చేస్తే మీరేమో జాబ్ చేస్తారు. రియల్ లైఫ్‌లో ఇలా జరిగే అవకాశమే లేదు కదా?
ఎందుకు లేదు? భార్యలు పని చేస్తుంటే ఇంటి పట్టున ఉండి, ఇంటిని చక్కదిద్దే భర్తలు ఉన్నారు. కాకపోతే ఆ విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడతారు.
భార్యను ఉద్యోగానికి పంపి, భర్త ఇంట్లో ఉంటే... ఆ భర్త అందరికీ చులకనే. పైగా ఏదైనా పార్టీకో, ఫంక్షన్‌కో వెళితే ‘మీ ఆయన ఏం చేస్తున్నాడు?’ అని అడుగుతారు కదా?
అవును. లోయర్, మిడిల్, అప్పర్... ఏ క్లాస్‌కి చెందిన ఆడవాళ్లైనా ఈ ప్రశ్నను తప్పించుకోలేరు. భర్త చేసే ఉద్యోగాన్ని బట్టి భార్యకు విలువ ఇస్తారు. మన ఇండియాలోనే ఇలా ఉంటుంది. నాకు తెలిసి విదేశాల్లో అంతగా పట్టించుకోరు. ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లను ‘మీరేం చేస్తారు?’ అనడిగితే.. ‘హౌస్ వైఫ్’ని అని చెప్పుకున్నంతగా ఈజీగా మగవాళ్లు ‘నేను హౌస్ హజ్బెండ్’ని అని చెప్పుకోలేరు. అదేదో కాని పని అన్నట్లుగా ఫీలైపోతారు.
‘మగవాళ్లు సంపాదించాలి. ఆడవాళ్లు ఇంటిని చక్కదిద్దుకోవాలి’ అన్న ఒకప్పటి కట్టుబాటు గురించి మీ అభిప్రాయం?
ఆ కాలంలో నేను లేనందుకు ఆనందంగా ఉంది. మెల్లి మెల్లిగా మార్పు రావడం ఓ రిలీఫ్. ఉద్యోగం చేసే హక్కు ఆడవాళ్లకు కూడా ఉంటుంది. ఇవాళ ఆడవాళ్లు సాధించనది అంటూ ఏమీ లేదు. లింగభేదంతో సంబంధం లేకుండా ప్రతిభ ఉన్నవాళ్లందరూ ఉద్యోగం చేసుకోవచ్చు.
ఆడవాళ్లు ఇంటి గడప దాటితే సమస్యలు వస్తాయంటారు. మీ లాంటి డబ్బున్నవాళ్లకి కూడా సమస్యలు వస్తాయా?
అఫ్కోర్స్... ఆడవాళ్ల సమస్యలకు స్థాయితో పని లేదు. ఎక్కడైనా ఉంటాయి. ఈ ప్రపంచంలో బలహీనులు ఎవరంటే అది ఆడవాళ్లే అనే ఫీలింగ్ కొంతమందికి ఉంటుంది. అందుకే వాళ్లను ఇబ్బందుల పాలు చేయాలనుకుంటారు. వీలైతే తొక్కేయాలనుకుంటారు. దానికోసం మానసికంగా, శారీరకంగా వేధించడానికి వెనకాడరు.
బాలీవుడ్లో పేరున్న కుటుంబానికి చెందిన అమ్మాయిగా మిమ్మల్ని వేధించే సాహసం ఎవరూ చేయకపోవచ్చు. ఒకవేళ చేస్తే... మీరెలా ట్యాకిల్ చేస్తారు?
మానసికంగా నేను చాలా బోల్డ్. మగవాళ్లను శారీరకంగా బలంగా, ఆడవాళ్లను మానసికంగా బలంగా ఆ భగవంతుడు సృష్టించాడన్నది నా నమ్మకం. మగవాళ్ల కన్నా మనకు మెంటల్ స్ట్రెంత్ ఎక్కువ అని నా ఫీలింగ్. ఆ బలమే మనకు మంచి ఆయుధం.
భయం భయంగా బతికే ఆడవాళ్లకు మీరిచ్చే సలహా ఏంటి?
ఆడపిల్లలా కాదు... పులిలా బతకండి. ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్లండి. మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటే ఎవరూ ఏమీ చేయలేరు. ఎవరో వచ్చి సహాయం చేస్తారులే అని కాకుండా మనకు మనమే సహాయం చేసుకోవాలి.
సూపర్... బాగా చెప్పారు...
థ్యాంక్యూ.. మీరేదో అడిగారని ఆవేశంగా చెప్పేయలేదు. నిజంగా కూడా ఆడవాళ్లు అమాయకంగా బతికేయకూడదు. తెలివిగా ఉండాలి. ప్రపంచం గురించి తెలుసుకోవాలి. అందుకే అందరూ చదువుకోవాలి.
మీ పదహారేళ్ల సినీ జీవితం గురించి ఏం చెబుతారు?
ఇది చాలా పెద్ద ప్రపంచం. పోటీ ఎక్కువ. తట్టుకుని నిలబడాలి. ప్రశంసలతో పాటు విమర్శలు వస్తాయి. ఎదుర్కోవాలి. మొదట్లో ఫెయిల్యూర్స్‌కి కంగారుపడేదాన్ని. సక్సెస్ వచ్చినప్పుడు సంతోషపడిపోయేదాన్ని. రాను రానూ సమానంగా తీసుకోవడం మొదలుపెట్టాను. విమర్శలకు ఫీలవ్వడం లేదు. అంతకు ముందు ఏదనుకుంటే అది క్షణాల్లో జరిగిపోవాలనుకునేదాన్ని. ఈ 16 ఏళ్ల జీవితం ఓపిక నేర్పించింది. దాంతో లైఫ్ హ్యాపీగా ఉంది.
80 ఏళ్ల వయసు వరకూ నటించాలన్నది మీ డ్రీమ్ అని ఓ సందర్భంలో అన్నారు. కథానాయికలు నలభైలకు దగ్గరపడితే క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారక తప్పదు కదా?
అలా ఎందుకు అంటున్నారు? హాలీవుడ్ మెరిల్ స్ట్రీప్‌ని తీసుకుందాం. ఆవిడ వయసిప్పుడు అరవై పైనే. మెరిల్ స్ట్రీప్ ఇప్పటికీ సినిమాలు చేస్తున్నారు. కానీ, ఆమెను ఎవరూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనరు. కథానాయిక అనే అంటారు. నేను కూడా ఆమెలానే నాయిక అనిపించుకోదగ్గ పాత్రలు ఎంచుకుంటాను.
ముద్దు పేరు: బెబో
పుట్టిన తేది: 1980 సెప్టెంబరు 21
పుట్టిన ఊరు: ముంబై
తల్లిదండ్రులు: రణధీర్ కపూర్ (ప్రముఖ నటుడు), బబితా కపూర్ (ప్రముఖ నటి)
ఎత్తు: ఐదు అడుగుల ఐదు అంగుళాలు
కథానాయికగా మొదటి సినిమా: ‘రెఫ్యూజి’ (2000)
అభిమాన నటీనటులు: సీనియర్ నటి నర్గిస్, సోదరి కరిష్మా కపూర్, షారుక్ ఖాన్
ఇష్టపడే ఫుడ్: చైనీస్, థాయ్, ఇటాలియన్
నచ్చే క్రీడ: స్విమ్మింగ్
ఇష్టపడే రంగులు: ఎరుపు, నలుపు
ఫేవరెట్ హాలిడే స్పాట్స్: గోవా, లండన్
నచ్చే ఆభరణాలు: వజ్రాభరణాలు.. ముఖ్యంగా బ్రాస్లెట్
జీవితాశయం: లివ్ అండ్ లెట్ లివ్
అంటే... ‘కథానాయిక’ అనిపించుకోవడానికి ఏజ్‌తో పని లేదంటారా? ఓల్డేజ్‌లో గ్లామరస్ క్యారెక్టర్స్ చేయలేరుగా?
కథానాయిక అంటే... కథకు కీలకంగా నిలిచే ఆడ పాత్ర అని అర్థం. గ్లామరస్‌గా కనిపిస్తేనే కథానాయిక అని కాదు. కథ నడిపించే దమ్మున్నవాళ్లను హీరో అనీ, ఆ పాత్ర తర్వాత కథ నడవడానికి కారణమయ్యే పాత్రను హీరోయిన్ అనీ అంటారు. సో... ఏజ్‌తో పని లేదు.
మీ జవాబులు వింటుంటే ‘బ్యూటీ విత్ బ్రెయిన్’ అనిపిస్తోంది..
మీ ప్రశ్నలు కూడా బాగున్నాయి. యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే బోల్డంత ఇష్టం. సినిమాలు మానేయాలనే ఊహను కూడా నేను భరించలేను.
ఇంతకీ దక్షిణాది వంటకాల్లో మీకేది ఇష్టం?
చెబితే నవ్వుతారేమో కానీ, నాకు ఇడ్లీలు ఉంటే చాలు. తెల్లటి చట్నీతో కలిపి అవి తింటుంటే భలేగా ఉంటుంది. ఈ ఇంటర్వ్యూకి వచ్చే ముందు కూడా ఇడ్లీలు లాగించే వచ్చాను అసలు హైదరాబాద్‌లో దిగగానే బ్రేక్‌ఫాస్ట్ ఏం కావాలని నా స్టాఫ్ అడిగితే.. ఇడ్లీలు చాలన్నాను.
మీ లాంటి నాజూకు నాయికలు మార్నింగ్ ఓట్స్, పండ్ల రసాలు, ఆమ్లెట్, ఎగ్ వైట్. ఇలా ఏవేవో తింటారు కదా..?
నేను కూడా అవి తింటాను. కానీ, ఇడ్లీలు దొరికితే అవే తింటాను. నాకు డైట్ గురించి పెద్దగా పట్టింపు ఉండదు.
అది సరే... తెలుగు సినిమాలు చూస్తుంటారా?
అప్పుడప్పుడూ చూస్తుంటా. భాష తెలియదు కాబట్టి, డైలాగ్స్ అర్థంకావు. సినిమాథీమ్ అర్థం చేసుకోగలుగుతా.
టాలీవుడ్లో మీ ఫ్రెండ్స్ లిస్ట్ చెబుతారా?
మా సైఫ్‌కి మహేశ్, నమ్రతా శిరోద్కర్ మంచి ఫ్రెండ్స్. వాళ్లు మినహా పెద్దగా ఎవరూ తెలియదు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల సీడీలు వాళ్లు పంపిస్తుంటే, చూస్తాను.
పెళ్లయ్యాక ముద్దు సీన్స్‌లో నటించనని, ‘కీ అండ్ కా’లో అర్జున్ కపూర్‌తో లిప్ లాక్ చేసేశారు. మీ భర్త సైఫ్ ఏమీ అనలేదా? మీ విషయంలో ఆయనకు పొసెసివ్‌నెస్ ఉండదా?
పొసెసివ్‌నెస్ ఎక్కువ. కానీ, నా మీద మాత్రమే అది. నాలో ఉన్న నటి మీద ఆయనకెలాంటి అభిప్రాయమూ ఉండదు. బాగాచేస్తే అభినందిస్తారు. అంతేతప్ప ‘ఫలానా పాత్రలు చేయొద్దు’ అని రూల్ పెట్టరు. అందుకే నచ్చిన పాత్రలు చేయగలుగుతున్నా. సినిమాకు ఏది అవసరమో అది చేయాలని తనకు తెలుసు. ట్రైలర్ బాగుందన్నారు.
నాయికగా వెలిగిన మీ అత్తగారు షర్మిలా ఠాగూర్ గురించి..?
మా అత్తగారు నేటి తరం మహిళ అనాలి. ఆమెది ఫార్వార్డ్ థింకింగ్. పెళ్లయ్యాక కూడా బిజీగా సినిమాలు చేశారు. ఇంటినీ, పిల్లలనూ బాగా చూసుకున్నారు. రోల్ మోడల్‌గా తీసుకోదగ్గ వ్యక్తి. ‘పని చేయాలి.. ఖాళీగా ఉండకూడదు’ అని నన్ను ఎంకరేజ్ చేస్తుంటారు.
ఫైనల్లీ... మీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది?
నాది ప్రశాంత జీవితం. ఏ విషయానికీ టెన్షన్ పడను. ఇల్లు, సినిమాలు... ఈ రెండే నా ప్రపంచం. ఓవరాల్‌గా లైఫ్‌ని హ్యాపీగా లీడ్ చేయాలన్నదే నా ఆశయం.
- డి.జి. భవాని