జిల్లావ్యాప్తంగా ‘ఓపెన్‌హౌస్’
నల్లగొండ క్రైం : జిల్లావ్యాప్తంగా ఓపెన్‌హౌస్ కార్యక్రమం నిర్వహించి పోలీస్‌స్టేషన్‌లో చేసే కార్యక్రమాలను వివరిస్తామని ఎస్పీ ప్రభాకర్‌రావు తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ పోలీసు అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వ్యాసరచన పోటీలు నిర్వహించనున్నట్టు చెప్పారు. సబ్‌డివిజనల్ వారీగా ఒక టీమ్ ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తామన్నారు. దాతలు ముందుకొస్తే జిల్లాలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. కెమెరాల ఏర్పాటుకు ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి నిధులిస్తామని హామీ ఇచ్చినట్లు చెప్పారు. జిల్లాలో మహిళల మెడలోని పుస్తెలతాళ్లను, బస్సు ల్లో బ్యాగులను, పర్స్‌లను చోరీ చేస్తున్న దొంగలను పట్టుకునేందుకు ప్రత్యేక టీం గాలిస్తున్నట్లు తెలిపారు.
పోలీసుశాఖలో మార్పులకు, సూచనలు సలహాలు ఇవ్వండి
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత పోలీసు శాఖలో చేపట్టాల్సిన చర్యలపై స్వచ్ఛంద సంస్థలు, మహిళలు, సామాజిక సేవా కార్యకర్తలు, సూచనలు..సలహాలు ఇవ్వాలని ఏఎస్పీ రమారాజేశ్వరి కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్‌శాఖ ప్రజలకు మరింత దగ్గరయ్యేలా చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో ప్రజలు నుంచి విజ్ఞప్తులు స్వీకరిస్తున్నట్టు తెలిపారు. నల్లగొండ ఎస్పీ ఫేస్బుక్లో కూడా పలు సూచనలు చేయవచ్చని పేర్కొన్నారు. పోలీసు వ్యవస్థ మార్పుల కోసం అన్నివర్గాల ప్రజలు, మహిళా స్వయం సహాయక సంఘాల నుంచి కూడా విజ్ఞప్తులను స్వీకరిస్తామని తెలిపారు. 14న మండలస్థాయిలో, 15న సబ్‌డివిజన్ స్థాయిలో, 16న తన కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి విజ్ఞప్తులు స్వీకరిస్తామని వివరించారు. క్షేత్రస్థాయి నుంచి మార్పుల కోసమే వినతులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు.