వందేళ్ల ఓటరు చైతన్యం
సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరుగుతోంది. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ బూత్... ఓటర్లు వరుసలో నిలబడి ఓట్లు వేసి బయటకు వస్తున్నారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులున్నారు. విశేషం ఏమిటంటే, ఆ ముగ్గురూ మూడు తరాల ప్రతినిధులు.101 ఏళ్ల నారాయణ స్వామి, ఆయన కుమారుడు, మనుమరాలు. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి దాకా విడవకుండా ఓటు వేస్తున్న శతాధిక చైతన్యశీలి నారాయణ స్వామిని కదిలిస్తే...
సామాజిక అభివృద్ధి!
స్వాతంత్య్రం తరవాత భారతదేశం చాలా అభివృద్ధి చెందింది. రిజర్వేషన్లు మంచి ఫలితాన్నే ఇచ్చాయి. సమాజంలో అన్ని వర్గాల్లోనూ విద్యాప్రమాణాలు, జీవనప్రమాణాలు మెరుగుపడ్డాయి. మా చిన్నతనంలో భూస్వాములు... పనివాళ్లను ఓటు వేయనివ్వకుండా కొట్టాల్లో దాచేసేవారు. ఎస్.సి. లకు కేటాయించిన స్థానాల్లో తమ పాలేర్లను నిలబెట్టి వారిని నామమాత్రంగా ఉంచేసేవారు. ఆ స్థితి నుంచి ప్రతి ఒక్కరికీ తమ ప్రతినిధిని ఎన్నుకోవడంలో స్వేచ్ఛ వచ్చింది. మేము హైస్కూల్‌కి ఏడు మైళ్లు నడిచివెళ్లాం. ఈ తరం ఇంటర్నెట్ సాయంతో ఇంట్లో కూర్చునే ప్రపంచాన్ని చూసేస్తోంది. జ్ఞానం మన అరచేతిలోకే వచ్చేసింది. రవాణా సులువైంది. అప్పటితో పోలిస్తే చాలానే అభివృద్ధి జరిగింది.
కంప్యూటర్ ముందు కూర్చుని ఫేస్బుక్లో నాయకుల కామెంట్లకు లైక్‌లు కొట్టే యువత పోలింగ్‌బూత్ వైపు అడుగు వేయట్లేదు. అలాంటిది ఈ వందేళ్ల పౌరుడు ఓటేయడానికి వచ్చాడు. తనతోపాటు కొడుకును తీసుకురావడం సరే... మనుమరాలు తొలిసారి ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా ప్రేరణగా నిలిచారీయన. ఈ సందర్భంగా మువ్వా నారాయణస్వామి పంచుకున్న అనుభవాలు...
గ్రామంలో చైతన్యం!
‘‘మాది గుంటూరు జిల్లా బాపట్ల దగ్గర నరసాయపాలెం. మా గ్రామంలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఇందుకు ఓ ఉదాహరణ... 1952- 55 మధ్య సంగతి ఇది. జాతీయ కాంగ్రెస్ పార్టీ గురించి, రాజకీయ విధానాల గురించి గ్రామస్థులకు వివరించే ప్రయత్నంలో మేధావులు ఊరూరికీ వచ్చారు. మా ఊరికీ ఇద్దరు న్యాయవాదులు వచ్చారు. వాళ్లు ఊరిపొలిమేరలో పశువుల కాపర్లతో మాటలు కలిపారు. అప్పుడు మా గ్రామంలో పశువులు కాసుకునే వాళ్లు అడిగిన ప్రశ్నలకు ఆ లాయర్లు బదులు చెప్పలేకపోయారు.
నిరక్షరాస్యుల్లోనే ఇంత చైతన్యం ఉంటే చదువుకున్న వాళ్లతో చర్చించడం తమకు సాధ్యమయ్యే పని కాదని ఊళ్లోకి రాకుండానే వెనక్కివెళ్లారు. అదే చైతన్యంతో మేము గ్రామంలో పాతుకొని పోయి ఉన్న మారెమ్మ జాతరలో జంతుబలిని ఆపేశాం. వేదాలు చదివిన త్రిపురనేని రామస్వామి చౌదరి, కొల్లూరి రాఘవయ్యలతో గ్రామంలో తర్కం నడిపి పొత్తర్లు వంటి క్రతువులను ఆపేశాం’’ అన్నారు నారాయణస్వామి.
యోధుల ప్రసంగాలు... రచనలు!
జాతీయోద్యమం దిశగా తనను ప్రభావితం చేసిన అంశాలనూ గుర్తు చేసుకున్నారాయన. ‘‘వీర సావర్కర్ రాసిన ‘ద ఇండియన్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్’ చదివాను. మార్క్స్, వివేకానందుని రచనలు చదివాను. మా చిన్నప్పుడు వేసవిలో గ్రామాల్లో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. చండ్రరాజేశ్వరరావు గారి దగ్గర డ్రిల్ నేర్చుకోవడం నాకు బాగా గుర్తుంది. కమ్యూనిస్టు నాయకులు వచ్చి విప్లవాల గురించి బోధించేవారు. వివిధ దేశాల విప్లవాలను చదివాను. ఆ ప్రభావంతో ఇంటర్ చదివేటప్పుడు బందరులో ఎన్నికల్లో చల్లపల్లి రాజాకు వ్యతిరేకంగా ప్రచారం చేశాం’’ అన్నారు.
ప్రజా జీవితం నుంచి అజ్ఞాతం లోకి...
స్వాతంత్య్రం వచ్చిన తర్వాత కూడా కమ్యూనిస్టులకు పోరాటం తప్పలేదు. 1947లో మనకు ప్రకటించింది సంపూర్ణ స్వాతంత్య్రం కాదు, అధినివేశ ప్రతిపత్తి మాత్రమేనని, భారతీయులు బ్రిటన్ రాణి పాలనలో ఉన్నట్లేనని ఊరూరా ప్రచారం చేశాం. 1948వ సంవత్సరం ఆగస్టు 15వ తేదీన మా నరసాయపాలెంలో నేను ప్రసంగిస్తున్నప్పుడు పోలీసులు వచ్చారు. అప్పుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాను. ఆ తర్వాత జైలు జీవితం అనుభవించాను. వీటన్నింటినీ దాటుకుని 1950లలో మా బాపట్లలో స్వయంగా ఎన్నికలు నిర్వహించిన బృందం మాది.
మా ఊరి గ్రంథాలయాన్ని పోలీస్ స్టేషన్‌గా మార్చింది ప్రభుత్వం. అప్పుడు మేము మరో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశాం. మా నాన్న ప్రజాఉద్యమాలు, రాజకీయాల్లో ఎంత చొరవగా ఉన్న ఫర్వాలేదు, కానీ అసెంబ్లీకి మాత్రం పోటీ చేయవద్దు అన్నారు. ఎందుకన్నారో తెలియదు, ఆ మాట ప్రకారం నేను పోటీ చేయలేదు’’ అన్నారు.
ఎందుకు ఉద్యమించామో!
ప్రజల నిరాసక్తత ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిదంటారు రాజనీతిజ్ఞులు. ఆ స్తబ్ధత పోవాలంటే ఓ నిశ్శబ్ద విప్లవం రావాల్సిందే. కానీ మనదేశంలో విప్లవం వచ్చే అవకాశాల్లేవంటారు నారాయణస్వామి. ‘‘పాశ్చాత్యులు వచ్చిన వందల యేళ్లకు కానీ జాతీయోద్యమం మొదలు కాలేదు. అప్పట్లో పోలీసులు వస్తే మా ఇంటి కుక్క వాళ్లను అడ్డుకుంది. దానిని తుపాకీతో మోది చంపారు. వెనుకవైపు నుంచి వచ్చిన పోలీసులను మా ఎడ్లు ఢీ కొన్నాయి. పోలీసుల విధ్వంసంతో ఒక ఎద్దుకు పిచ్చిపట్టింది, మా నాన్న పక్షవాతంతో మంచం పట్టారు. ఇప్పటి పరిస్థితులను చూస్తుంటే అప్పుడు మేము ఉద్యమించినది ఎందుకో అర్థం కావట్లేదు’’ అన్నారు కొంత నిర్లిప్తంగా.
క్రియాశూన్య జ్ఞానంతో సున్నా!
గ్రామాలు రాజకీయంగా చైతన్యవంతం అయ్యాయి. గ్రామీణులు ప్రతి పరిణామాన్నీ నిశితంగా గమనిస్తున్నారు. కానీ ఊళ్లో అరుగుల మీద కూర్చుని ఢిల్లీ ప్రభుత్వం ఏం చేసింది, రాష్ట్ర ప్రభుత్వం ఇలా ఎందుకు చేయలేదు అని తూర్పారబట్టడానికే పరిమితమవుతున్నారు. సొంతూళ్లో పాల డెయిరీ ఎలా నడుస్తోంది? చౌక దుకాణంలో సరుకులు సరిగా ఇస్తున్నారా? పంచాయితీ ఎలా నడుస్తోంది... అని చూడడం లేదు. క్రియాశూన్యమైన కొండంత జ్ఞానంతో ఏదీ సాధించలేం, క్రియాశీలకంగా గోరంత జ్ఞానం చాలు... అనేటప్పుడు ఆయన మాటల్లో సమాజానికి ఇంకా ఏదో చేయాలనే తాపత్రయం కనిపించింది.
నాటి జ్ఞాపకాలతోనే...
‘‘రెండవ ప్రపంచ యుద్ధకాలంలో శత్రుదేశాల సైన్యం మనదేశంలోకి చొచ్చుకు వస్తోందనే సమాచారంతో మాకు ఆత్మరక్షణ పద్ధతులు నేర్పించారు. చేతి రుమాలులో కొండరాళ్లు కట్టే వాళ్లం. శత్రువులు వస్తే ఆ రాళ్ల మూటను వడిసెలాగా తిప్పి విసిరితే అక్కడికక్కడే కింద పడిపోతారు. అలా ఏవేవో నేర్చుకున్నాం. ఇప్పుడు అర్థం కాని పుస్తకం తీసుకుని కుస్తీ పట్టడమే నా వ్యాపకం’’ అన్నారాయన నవ్వుతూ.
ప్రతిరోజూ ‘ది హిందూ’, ‘టైమ్స్ ఆఫ్ ఇండియా’ దినపత్రికలు చదువుతారు నారాయణస్వామి. ఫ్రంట్‌లైన్ మ్యాగజైన్‌ను క్రమం తప్పరు. వీటితోపాటు ప్రాచీన భారతీయ సంస్కృతి, సామాజిక రచనలనూ చదువుతారు. ప్రజాస్వామ్యం అంటే... ప్రజలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల ద్వారా పరిపాలన సాగడం అని మాత్రమే మనకు పుస్తకాలు తెలిపాయి. అయితే ఆ ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యేవారే అయి ఉండాలని మరో భాష్యం చెప్పారు నారాయణస్వామి. ఈయన చదివిన పుస్తకాలన్నీ చదవడం ఎందరికి సాధ్యమవుతుందో కానీ, ఆయనే ఓ పుస్తకం. ఈ పుస్తకాన్ని చదవగలిగితే చాలా విషయాలు తెలుస్తాయనడంలో సందేహం లేదు.
- వాకా మంజులారెడ్డి,
ఫొటోలు : ఎస్ ఎస్ ఠాకూర్
మనలో ఒకరైతే!
ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్ధులు నియోజకవర్గ ప్రజలకు తెలిసిన వారైతే ఓటు వేయాలనే ఉత్సాహం వస్తుంది. ప్రజల్లో మమేకమై నియోజకవర్గంలోని ప్రజల కోసం పనిచేసిన వాళ్లు, కనీసం మాటసాయానికి అందుబాటులో ఉండే వాళ్లు నిలబడితే అందరూ ఓటు వేస్తారు. అలా కాకపోతే ఎన్నికల పట్ల ఆసక్తి చూపించలేరు. ఇందుకు బాధ్యత అంతా రాజకీయ పార్టీలదే.
- మువ్వా నారాయణస్వామి