కూతురి సాక్షిగా.. సుత్తితో మోది భర్త హత్య!
ఆ చిన్నారి వయసు నాలుగేళ్లు. రాత్రి ఇంట్లో టీవీ చూస్తోంది. కానీ.. టీవీలో వచ్చే క్రైం డ్రామా కంటే ఇంట్లో జరుగుతున్న ఘోరమే ఆ అమ్మాయిని ఎక్కువగా భయపెట్టింది. ఉన్నట్టుండి తన తల్లి అరుపు గట్టిగా వినపడటంతో ఏం జరిగిందోనని అక్కడకు పరిగెత్తుకువ వెళ్లింది. తీరాచూస్తే, జీవితంలో మర్చిపోలేని షాక్ ఆ అమ్మాయికి తగిలింది. కన్నతండ్రిని తన తల్లి సుత్తితో 24 సార్లు తలపై కొట్టి చంపేయడాన్ని ఆమె చూసింది. ఇంతకీ ఎందుకు ఆమె అంత దారుణానికి తెగబడిందో తెలుసా.. మానసిక సమస్యలతో బాధపడుతున్న ఆమెకు మందులు తేవడం ఆ భర్త కమల్‌కుమార్ (35) మర్చిపోయాడు. దాంతో ఆయన భార్య హన్సి (32) అతడిని సుత్తితో కొట్టి చంపేసింది. ఆ దంపతులకు నాలుగు, రెండు ఏళ్ల వయసున్న ఇద్దరు కూతుళ్లు, ఏడాది వయసున్న కొడుకు ఉన్నారు.
అనాథగా పెరిగిన కమల్.. హన్సిని పెళ్లి చేసుకోడానికి ముందు నుంచే ఇద్దరూ నరేలా సెక్టార్ ఎ5లోని ఒకే కాలనీలో నివసించేవాళ్లు. హన్సికి మానసిక సమస్యలున్నాయి. ఆమెకు తరచు కోపం వస్తుంటుంది. అందుకోసం ఆమె విమ్‌హాన్స్‌లో చికిత్స పొందుతోంది. కమల్ చాలా మెత్తటి మనిషి. అతడంటే కాలనీలో అందరికీ ఇష్టమే. హన్సి తల్లిదండ్రులు కూడా అతడైతే తమ కూతురిని బాగా చూసుకుంటాడని భావించి ఇద్దరికీ ఆరేళ్ల క్రితం పెళ్లి చేసి, దగ్గర్లోనే ఓ అద్దె ఇల్లు కూడా చూసిపెట్టారు. సమీపంలోని పారిశ్రామిక ప్రాంతంలో గల ఓ ఫ్యాక్టరీలో కమల్ పనిచేసేవాడు. ఎప్పుడూ తన భార్యను చాలా బాగా చూసుకునేవాడు. అయితే ఆమె ఇలా చేస్తుందని మాత్రం ఎవరూ ఊహించలేకపోయారు.
ఆ రోజు రాత్రి ఏం జరిగింది..
మంగళవారం రాత్రి కమల్ మందులు తేకపోవడంతో ఇద్దరి మధ్య కొంత గొడవ జరిగింది. అతడు ఏమీ తినకుండానే నిద్రపోయాడు. కొడుకు, చిన్నకూతురు కూడా నిద్రపోగా.. పెద్దమ్మాయి మాత్రం రాత్రి 11 గంటల వరకు టీవీ చూస్తూ ఉండిపోయింది. అంతలో ఈ దారుణం జరిగింది. తన తల్లి సుత్తితో నాన్నను కొట్టి చంపేసిన తర్వాత కత్తెర తీసుకుని దాంతో కూడా పొడిచిందని ఆ చిన్నారి చెప్పింది. ఆ తర్వాత.. ఇంటికి తాళం వేసి.. ఇంటిముందు నుంచి వెళ్తున్న పెళ్లి ఊరేగింపు చూస్తూ తాను కూడా ఊరేగింపులో పాల్గొంది. అప్పటికి ఆమె ముఖం మీద రక్తపు మరకలున్నాయి. చుట్టుపక్కల వాళ్లు అది చూసి, హోలీ రంగులేమో అనుకున్నారు. మర్నాటి ఉదయం ఆమె మామూలుగానే లేచి అందరికీ టిఫిన్ చేయసాగింది. పిల్లలకు నాన్నను నిద్రలేపమని కూడా చెప్పింది. కానీ పిల్లలంతా భయంతో ఒక మూల నక్కి ఉన్నారు. పెద్దపాప ఎలాగోలా ఇంటినుంచి తప్పించుకుని వెళ్లి, అమ్మమ్మకు, ఇతర బంధువులకు విషయం చెప్పింది. పోలీసులు హన్సిని అరెస్టు చేసి, వైద్య పరీక్షలకు పంపారు.