కాంగ్రెస్ మేయర్ అభ్యర్థిగా అజారుద్దీన్?
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో పార్టీ తరఫున మేయర్ అభ్యర్థిగా ఇండియా క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహ్మద్ అజారుద్దీన్‌ను దించాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నికల కంటే ముందే అజార్‌ను ఇందుకు ఒప్పించేందుకు ప్రయత్నిస్తోంది. సెలబ్రిటీ హోదాతో పాటు హైదరాబాద్‌కు చెందిన వ్యక్తి కావడంతో అజార్‌కు నగర యూత్‌లో మంచి ఫాలోయింగ్ ఉంది. కాంగ్రెస్ నుంచి ఎంఐఎం దూరం కావటం, అధికార టీఆర్ఎస్ పలు కార్యక్రమాలతో దూకుడు పెంచటంతో కాంగ్రెస్ పార్టీ సైతం తన వ్యూహాలకు పదును పెట్టింది.
ఒక వైపు ఎంఐఎంకు చెక్పెట్టటంతో పాటు, టీఆర్ఎస్ దూకుడును తగ్గించవచ్చన్న ఆలోచనతో మేయర్ అభ్యర్థి ప్రతిపాదనను పీసీసీ అజారుద్దీన్ ముందుంచినట్లు సమాచారం. అయితే, తన నిర్ణయాన్ని ఇప్పుడే వెల్లడించలేనని, సమయం కావాలని ఆయన కోరినట్లు తెలిసింది. ఒకవేళ అజార్ ముందుకురాకపోతే మాజీ మంత్రి ముఖేష్ తనయుడు విక్రంగౌడ్తోపాటు మరికొందరు పేర్లను పరిశీలించాలని పీసీసీ నేతలు భావిస్తున్నారు.