30న మెడికల్ షాపులు బంద్
- ఆన్లైన్లో ఔషధ విక్రయాల ఆలోచనను విరమించుకోవాలి
- హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ డిమాండ్
హైదరాబాద్: ఆన్లైన్లో మందుల అమ్మకానికి అనుమతివ్వాలన్న కేంద్ర ప్రభుత్వం ఆలోచనను వెంటనే విరమించుకోవాలని గ్రేటర్ హైదరాబాద్ రిటైల్ మెడికల్ షాప్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ–పోర్టల్ విధానానికి వ్యతిరేకంగా 30న దేశవ్యాప్తంగా మెడికల్షాపుల బంద్కు మద్దతిస్తున్నట్లు అసోసియేషన్ తెలిపింది. విలేకరులతో అసోసియేషన్ కార్యదర్శి కిషన్ మురారి శెట్టి, కోశాధికారి ఆర్గోండలు ఆదివారం మాట్లాడుతూ.. ఆన్లైన్లో ఔషధాల విక్రయాలను వ్యతిరేకిస్తూ ఈ నెల 30న నగరంలోని 12,500 మెడికల్ షాపులను మూసివేస్తున్నామన్నారు.
ఔషధాల ధరలు పెరిగేందుకు తాము కారణం కాదని, కనీస ఔషధాల ధర నిర్ణయించేది ప్రభుత్వమేనన్నారు. ప్రభుత్వాలే ఔషధాల ధరను నియంత్రించాలని కోరారు. షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ ఔషధాలు ఆన్లైన్లో విక్రయిస్తే ప్రజల ప్రాణాలకు ఇబ్బందులు కలిగే అవకాశముందని ఆందోళన వ్యక్తం చేశారు. మందుల చీటీపై ఔషధాల పేరును స్పష్టంగా రాయాలని, జనరిక్ మందులు రాయాలన్న నిబంధనలు ఎక్కడా అమలు కావడం లేదన్నారు.