యూటీ ప్రతిపాదన అప్రజాస్వామికం: జీవన్‌రెడ్డి
తెలంగాణలో ఉన్న హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలనే ప్రతిపాదన అప్రజాస్వామికమని మాజీ మంత్రి జీవన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఏపీఎన్జీవోల సభకు అనుమతించడం తెలంగాణ మనోభావాలను దెబ్బతీయడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. హింసను ప్రోత్సహించేవిధంగా ఏపీఎన్జీవోల సభకు అనుమతివ్వడం సరికాదని అన్నారు.
జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాల్సివుంటుందని ఆయన హెచ్చరించారు. ఇప్పటికైనా సీఎం కిరణ్ విజ్ఞతను ప్రదర్శించి ఏపీఎన్జీవోల సభ అనుమతిని రద్దుచేయాలని, లేదంటే టీఎన్జీవోల ర్యాలీకి కూడా అనుమతివ్వాలని జీవన్‌రెడ్డి డిమాండ్ చేశారు.
సీడబ్ల్యూసీ నిర్ణయానికి కట్టుబడి ఉంటామన్న సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇప్పుడు దానిని వ్యతిరేకించడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేయడమేనని జీవన్‌రెడ్డి అంతకుముందు అన్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధికోసం తెలంగాణకు మరోసారి అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.