I2U2 Summit: ‘ఐ2యూ2’ సానుకూల అజెండా
న్యూఢిల్లీ: నాలుగు దేశాల ‘ఐ2యూ2’ కూటమి తన తొలి శిఖరాగ్ర సదస్సులోనే సానుకూల అజెండాను సిద్ధం చేసుకుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. ఇంధన భద్రత, ఆహార భద్రత, ఆర్థిక ప్రగతి కోసం నాలుగు దేశాలు కలిసికట్టుగా పనిచేయబోతున్నాయని, ఈ మేరకు ఒక ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించుకున్నాయని వెల్లడించారు. ప్రస్తుత అంతర్జాతీయ అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఆచరణీయ పరస్పర సహకారానికి ఈ ఫ్రేమ్‌వర్క్ ఒక మంచి మోడల్ అని ఉద్ఘాటించారు.
ఐ2యూ2(ఇండియా, ఇజ్రాయెల్, యూఎస్ఏ, యూఏఈ) తొలి శిఖరాగ్ర సదస్సును గురువారం వర్చువల్‌గా నిర్వహించారు. సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి యైర్ లాపిడ్, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, యూఏఈ అధ్యక్షుడు మొహమ్మద్ బిన్ జాయెద్ అల్–నహ్యాన్ పాల్గొన్నారు. సదస్సును ఉద్దేశించి మోదీ మాట్లాడారు. ఐ2యూ2 అజెండా, దార్శనికత ప్రగతిశీలకంగా, ఆచరణయోగ్యంగా ఉందని కొనియాడారు.
నాలుగు దేశాల పెట్టుబడి, నిపుణత, మార్కెట్లు వంటి బలాలను ఒకే వేదికపైకి తీసుకొస్తే అది ప్రపంచ ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని అన్నారు. వివిధ రంగాల్లో పలు ఉమ్మడి ప్రాజెక్టులను గుర్తించామని, వాటి అమలు విషయంలో ముందుకెళ్లేందుకు రోడ్‌మ్యాప్‌ను రూపొందించుకున్నామని ఉద్ఘాటించారు. నీరు, ఇంధనం, రవాణా, అంతరిక్షం, ఆరోగ్యం, ఆహార భద్రత వంటి ఆరు కీలక రంగాల్లో ఉమ్మడి పెట్టుబడులను మరింత పెంచేందుకు అంగీకారానికొచ్చామన్నారు.