పురుగుమందు తాగి యువకుడి ఆత్మహత్య
ఇబ్రహీంపూర్(రఘునాథపల్లి) : మండలంలోని ఇబ్రహీంపూర్లో సుద్దాల రమేష్(25) అనే యువకుడు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రమేష్ తండ్రి కొమురయ్య చిన్నతనంలోనే చనిపోవడంతో తల్లి లక్ష్మి కూలీనాలీ చేస్తూ కుటుంబాన్ని పోషించింది. నాలుగేళ్ల క్రితం రమేష్‌కు వివాహం జరిపించింది. రమేష్ దంపతుల మధ్య మూడేళ్ల క్రితం తగాదాలు తలెత్తాయి. దీంతో భార్య విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. మనోవేదనకు గురైన రమేష్ మద్యానికి బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం తాగి ఇంటికొచ్చి పురుగుమందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారుజామున అతడిని నిద్రలేపేందుకు తల్లి వెళ్లగా, మృతిచెంది కనిపించాడు. ఎస్సై రంజిత్‌రావు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.