Illegal contructions
-
కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు భారీ షాక్
ముంబై: కేంద్ర మంత్రి నారాయణ్ రాణెకు షాక్ ఇచ్చింది ముంబై హైకోర్టు. జుహు ప్రాంతంలోని రాణెకు చెందిన భవనం పరిధిలో అక్రమ నిర్మాణాలను కూల్చివేయాలని ముంబై అధికారులను ఆదేశించింది. ఆ నిర్మాణాలు ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్(ఎఫ్ఎస్ఐ), కోస్టల్ రెగ్యులేషన్ జోన్(సీఆర్‌జడ్) నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టం చేసింది జస్టిస్ ఆర్డీ ధనుక, జస్టిస్ కమల్ ఖాటాలతో కూడిన ధర్మాసనం. నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలంటూ రాణా కుటుంబం నిర్వహిస్తున్న సంస్థ దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిగణనలోకి తీసుకోవద్దని బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ)ని ఆదేశించింది ధర్మాసనం. అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయటం ద్వారా అలాంటి వాటిని ప్రోత్సహించినట్లు అవుతుందని స్పష్టం చేసింది. రెండు వారాల్లోపు అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని బీఎంసీకి సూచించింది కోర్టు. ఆ తర్వాత వారం లోపు నివేదికను సమర్పించాలని తెలిపింది. అక్రమ నిర్మాణాలను కూల్చి వేయాలని ఆదేశించటంతో పాటు కేంద్ర మంత్రి నారయణ్ రాణెకు రూ.10 లక్షల జరిమానా విధించింది కోర్టు. రెండు వారాల్లోగా మహారాష్ట్ర లీగల్ సర్వీసెస్ విభాగంలో డిపాజిట్ చేయాలని ఆదేశించింది. మరోవైపు.. ఈ అంశంపై ఆరు వారాలు స్టే ఇవ్వాలని, దాంతో సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తామని రాణె తరఫు న్యాయవాది కోరగా.. అందుకు ధర్మాసనం నిరాకరించింది. సివిక్ బాడీ గతంలో ఇచ్చిన ఆదేశాలపై తాము దాఖలు చేసిన రెండో దరఖాస్తును పరిశీలించేలా ఆదేశించాలని రాణెకు చెందిన కాల్కా స్థిరాస్తి సంస్థ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది. అంతకు ముందు ఈ ఏడాది జూన్‌లో అదనపు నిర్మాణాలను రెగ్యులరైజ్ చేయాలని కోరగా బీఎంసీ తిరస్కరించింది. దీంతో హైకోర్టును ఆశ్రయించింది సంస్థ. ఇదీ చదవండి: ఆ చీతాల రక్షణ విధుల్లోకి గజరాజులు.. రేయింబవళ్లు గస్తీ! -
ఆన్లైన్లో అక్కర్లేదు.. నేరుగా ఇవ్వండి
క్రమబద్ధీకరణకు హెచ్ఎండీఏ వెసులుబాటు సాక్షి, హైదరాబాద్: అక్రమ నిర్మాణాలు, లేఅవుట్లను ఎల్ఆర్ఎస్/బీఆర్ఎస్ల కింద క్రమబద్ధీరించుకొనే వారు తమ దరఖాస్తులను నేరుగా అందజేయవచ్చు. గడువు దగ్గరపడటంతో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొనేందుకు వేల సంఖ్యలో ప్రయత్నిస్తుండటంతో హెచ్ఎండీఏలో సర్వర్లు మొరాయించిన సంగతి తెలిసిందే. దీంతో దరఖాస్తుదారులకు ఇబ్బంది కలగకుండా చేతిరాత (పెన్ను)తో నింపిన దరఖాస్తులను సైతం స్వీకరించేలా హెచ్ఎండీఏ కమిషనర్ టి.చిరంజీవులు చర్యలు చేపట్టారు. నిన్నటివరకు ఆన్లైన్లోనే విధిగా దరఖాస్తును నింపి ప్రింటవుట్ తీసుకొని దానికి మిగతా డాక్యుమెంట్లు, రూ.10 వేల డీడీని జతచేయాలనే నిబంధన ఉండేది. అలా వచ్చిన దరఖాస్తులనే హెచ్ఎండీఏ కౌంటర్లో స్వీకరించేవారు. దీంతో జాప్యం అవుతుండటంతో ఆన్‌లైన్‌తో సంబంధం లేకుండా దరఖాస్తులను చేతిరాతతో నింపి నిర్దేశించిన డాక్యుమెంట్లను జతచేసి నేరుగా ఇవ్వాలని కమిషనర్ సూచించారు. ప్రధానంగా బీఆర్ఎస్ దరఖాస్తులకు గతంలో మంజూరు చేసిన ధ్రువపత్రం (ఉంటే), భూమి/బిల్డింగ్‌కు సంబంధించి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినవి), బిల్డింగ్ ప్లాన్‌కు సంబంధించి లెసైన్స్డ్ ఆర్కిటెక్ట్/ ఇంజనీర్‌చే ధ్రువీకరించిన నమూనా (3 సెట్లు), రూ.10 వేల డీడీ (ది మెట్రోపాలిటన్ కమిషనర్, హెచ్ఎండీఏ పేరుతో.. ఏదైనా జాతీయ బ్యాంకు నుంచి), ఇండెమ్నిటీ బాండ్, బిల్డింగ్ ఫొటోలు (ఎలివేషన్ ఫొటో) విధిగా సమర్పించాలని కమిషనర్ సూచించారు. అలాగే ఎల్ఆర్ ఎస్‌కు సంబంధించి భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ (గెజిటెడ్ అధికారి ధ్రువీకరించినది), స్థలం ప్లాన్ (లొకేషన్ స్కెచ్ ప్లాన్), లే అవుట్ ప్లాన్‌లో ప్లాట్ స్థలం, ఖాళీ ప్రదేశం, రోడ్ తదితరాలు, ఇండెమ్నిటీ బాండ్, రూ.10 వేల డీడీ తప్పని సరిగా దరఖాస్తుతోపాటు జతచేయాలని తెలిపారు. గడువులోగా తీసిన డీడీలున్న దరఖాస్తులన్నింటినీ స్వీకరించాలని కమిషనర్ అధికారులను ఆదేశించారు. -
ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ గడువు పెంపు!
* నేటితో ముగియనున్న గడువు * సీఎం కేసీఆర్ అనుమతి కోసం పురపాలక శాఖ నిరీక్షణ సాక్షి, హైదరాబాద్: అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాల గడువు ఈనెల 31 (గురువారం)తో ముగిసిపోనుంది. గడువు మరో రెండు నెలలు పొడిగించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినా ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. దీనిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నుంచి అనుమతి కోసం పురపాలక శాఖ బుధవారం సాయంత్రం వరకు నిరీక్షించింది. శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.జి గోపాల్, జీహెచ్ఎంసీ కమిషనర్ బి.జనార్దన్ రెడ్డి బుధవారం రాత్రి సీఎం కేసీఆర్‌ను క్యాంపు కార్యాలయంలో కలసి గడువు పెంపునకు అనుమతి కోరారు. ఈ అంశంపై గురువారం చర్చించి నిర్ణయం తీసుకుందామని కేసీఆర్ చెప్పినట్లు తెలిసింది. గురువారం అనుమతి లభిస్తే ఆ వెంటనే అంతర్గత ఉత్తర్వులు (సర్క్యులర్) జారీ చేస్తామని ఓ అధికారి ‘సాక్షి’కి తెలిపారు. ఇదిలాఉండగా, ప్రభుత్వం నిబంధనలకు విరుద్ధంగా ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ పథకాలను ప్రవేశపెట్టిందంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ పథకాల కింద దరఖాస్తుల స్వీకరణకు అనుమతించిన హైకోర్టు.. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు వాటిని పరిష్కరించవద్దని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ల గడువు పెంచుకోడానికి అడ్డంకులు లేవని అధికారులు చెబుతున్నారు. స్పందన అంతంతే... అక్రమ కట్టడాలు, లే అవుట్ల క్రమబద్ధీకరణకు ఆశించిన స్పందన రాలేదు. అక్రమాల క్రమబద్ధీకరణ ద్వారా ఏకంగా రూ.1,000 కోట్ల ఆదాయాన్ని గడించాలన్న జీహెచ్ఎంసీ అధికారుల అంచనాలు తలకిందులయ్యాయి. ఇక రాష్ట్రంలోని ఇతర 67 నగర, పురపాలికల పరిధిలో నామమాత్రపు సంఖ్యలోనే దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 వరకు లే అవుట్ల క్రమబద్ధీకరణ కోసం 65,079 దరఖాస్తులు, భవనాల క్రమబద్ధీకరణ కోసం 62,659 దరఖాస్తులు వచ్చాయి. తొలుత దరఖాస్తుతోపాటు కనీసం రూ.10 వేల డీడీని సమర్పించాలని, మిగిలినరుసుమును పరి ష్కార సమయంలో చెల్లించాలని ఎల్ఆర్ఎస్, బీఆర్ఎస్ నిబంధనలు పేర్కొంటున్నాయి. ఈ మేర కు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.48.79 కోట్లు, బీఆర్ఎస్ దరఖాస్తుల నుంచి రూ.37.89 కోట్ల ఆదాయం వచ్చింది. వీటిని పరిష్కరిస్తే ఆదాయం రూ.1,000 కోట్లకు పైనే ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.