నలుగురు ఎర్ర స్మగ్లర్ల అరెస్ట్
వారిలో ముగ్గురు టీడీపీ నేతలు
రాత్రికి రాత్రే రాజమండ్రి జైలుకు
చిత్తూరు, న్యూస్‌లైన్: ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నలుగురు బడా స్మగ్లర్లను చిత్తూరు పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. వారిని రాత్రికి రాత్రే రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. చిత్తూరు జిల్లాకు చెందిన భాస్కర్ నాయుడు, విజయానందబాబు, వైఎస్సార్ జిల్లాకు చెందిన మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణలను అరెస్టుచేసి వీరిపై పీడీ యాక్టు నమోదు చేశారు. వీరిలో భాస్కర్ నాయుడు, మహేష్ నాయుడు, మదిపట్ల రెడ్డినారాయణ తెలుగు దేశం పార్టీకి చెందిన వారు.
డీఎస్పీ కమాలాకర్‌రెడ్డి, ట్రైనీ ఎస్పీ అన్బురాజు ఈ విషయాలను విలేకరుల సమావేశంలో వెల్లడించారు. వారి కథనం మేరకు... ఎర్రచందనం స్మగ్లింగ్‌లో చిత్తూరు జిల్లా కేవీ పల్లె మండలం నూతన కాల్వకు చెందిన భాస్కర్ నాయుడుపై 20కి పైగా కేసులున్నాయి. చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లెకు చెందిన విజయానందబాబు అలియాస్ బాబురెడ్డిపై 20కి పైగా కేసులు నమోదయ్యాయి. వైఎస్సార్ జిల్లా సుండుపల్లె మండలం రెడ్డివారిపల్లెకు చెందిన మహేష్‌నాయుడు, సంబేపల్లె మండలం బాటావాండ్లపల్లెకు చెందిన మదిపట్ల రెడ్డినారాయణలపై పలు పోలీస్ స్టేషన్లలో ఎర్రచందనం స్మగ్లింగ్‌కు సంబంధించిన కేసులు నమోదై ఉన్నాయి. కాగా తిరుపతిలోని శేషాచలం అడవుల్లో అటవీశాఖ అధికారులను కొట్టి చంపిన కేసుల్లో సైతం వీరి ప్రమేయం ఉన్నట్టు పోలీసులు కేసులు నమోదు చేశారు.