అక్రమ భవనాలన్నింటికీ ఇంప్లోజన్
⇒అన్ని ప్రాంతాల్లో ఇదే విధానం
⇒సామర్ధ్యం కలిగిన సంస్థ కోసం త్వరలో టెండర్లు
⇒గుట్టలబేగంపేటలో కూలిన భవనానికి రెండుమూడు రోజుల్లో మళ్లీ ఇంప్లోజన్
సిటీబ్యూరో: జీహెచ్ఎంసీ పరిధిలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసేందుకు జీహెచ్ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇందుకుగాను సోమవారం ప్రయోగించిన ‘ఇంప్లోజన్’ విధానంలో భవనం పాక్షికంగానే కూలినప్పటికీ, కాంట్రాక్టు సంస్థ నైపుణ్య లేమి ఇందుకు కారణంగా గుర్తించారు. తగిన నైపుణ్యం, అనుభవం కలిగిన వారిని ఎంపిక చేయడం ద్వారా అక్రమంగా వెలసిన పెద్ద భవంతులన్నింటినీ ఇంప్లోజన్ విధానంలో కూల్చివేయాలని భావిస్తున్నారు.
మాన్యువల్‌గా కంటే ఇంప్లోజన్ ద్వారా తక్కువ సమయం, తక్కువ వ్యయం కానుండటంతో చెరువులు, ప్రభుత్వ భూములు, నాలాల భూముల్లో వెలసిన పెద్ద నిర్మాణాలన్నింటికి ఈ విధానాన్ని వర్తింపజేయనున్నట్లు చీఫ్‌సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి తెలిపారు. ఇందుకుగాను త్వరలో టెండర్లు ఆహ్వానిస్తున్నామన్నారు. ఈమేరకు ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటరెస్ట్) ఆహ్వానించనున్నారు. టెండర్లలో పాల్గొనే సంస్థల శక్తిసామరŠాధ్యలు, నైపుణ్యం, ఇతరత్రా అంశాలను పరిగణనలోకి తీసుకొని ఎంపిక చేపడతారు. గుట్టల బేగంపేట సున్నంచెరువు బఫర్‌జోన్‌లో సోమవారం కూల్చివేసిన భవనం పక్కనే ఉన్న మరో భవనాన్ని కూడా తగిన నోటీసులిచ్చాక కూల్చివేయనున్నట్లు తెలిపారు.
ఆ భవనానికి అనుమతి ఇచ్చాక, అది బఫర్‌జోన్‌లో ఉన్నట్లు తెలిసిందని, దాంతోపాటు బఫర్‌జోన్, ఎఫ్టీఎల్ల పరిధిలోని ఇతర భవనాలను సైతం నిబంధనల కనుగుణంగా తగిన చర్యలు తీసుకొని కూల్చివేస్తామని ఆయన పేర్కొన్నారు. వెస్ట్‌జోన్‌లో ప్రారంభించిన ఇంప్లోజన్ కూల్చివేతల్ని అన్ని జోన్లలోని అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు వినియోగించనున్నారు.
రెండు మూడు రోజుల్లో మళ్లీ ఇంప్లోజన్..
సోమవారం పాక్షికంగా కూలిన భవనాన్ని మరో రెండు మూడు రోజుల్లో పూర్తిగా నేలమట్టం చేసేందుకు కాంట్రాక్టు సంస్థ ఉత్తమ్ బ్లాస్టెక్ ప్రైవేట్ లిమిటెడ్ సిద్ధమైంది. పేలుడు పదార్థాలను అమర్చేందుకు వీలుగా మంగళవారం అన్ని ఫ్లోర్లలోనూ పిల్లర్లకు రంద్రాలు వేశారు. జేఎన్టీయూ ఇంజనీరింగ్ నిపుణుడు ప్రొఫెసర్ రమణారావు సదరు భవన పటిష్టతను పరిశీలించి మరోమారు ఇంప్లోజన్ జరుపవచ్చునని అభిప్రాయపడ్డారు. ఇటుకలు, డెబ్రిస్‌ను తొలగించాల్సిందిగా జీహెచ్ఎంసీ అధికారులకు సూచించారు.
అన్నీ పేలనందునే..
భవనం కూల్చివేతకు అమర్చిన అన్ని డిటొనేటర్ల బటన్లను ఏకకాలంలో వినియోగించనందువల్ల భవనం మొత్తం కూలకుండా కేవలం గ్రౌండ్ ఫ్లోర్మాత్రం కూలిందని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. ఒకటి, రెండో అంతస్తులకు అమర్చిన ౖవైర్లు తెగిపోవడం వల్ల పేలుడు పదార్థాలు పేలకపోవడంతో భవనం మొత్తం కూలిపోకుండా పక్కకు ఒరిగిపోయిందన్నారు. ప్రస్తుతం ఆ భవనం పక్కనుంచి నడవడానికి పాదచారులు భయపడుతున్న నేపథ్యంలో రెండు రోజుల్లో భవనాన్ని పూర్తిగా నేలమట్టం చేయనున్నట్లు తెలిపారు.