హవాలా రాకెట్‌లోనూ రౌడీలు
ముంబై మాఫియాతో సంబంధాలపై పోలీసుల ఆరా
రౌడీషీటర్ ఇమ్రానుద్దీన్‌పై పీడీ యాక్ట్?
సాక్షి, సిటీబ్యూరో: ఇప్పటి వరకు ఆస్తి సెటిల్మెంట్లు, కిరాయి హత్యలకు పాల్పడుతున్న నగరంలోని రౌడీలు తాజాగా హవాలా వ్యాపారంలోకి అడుగుపెట్టారు. మంగళవారం నారాయణగూడలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ నంద్యాల కోటిరెడ్డి పర్యవేక్షణలో జరిపిన వాహన తనిఖీల్లో హవాలా సొత్తు సుమారు రూ. 2 కోట్లు పట్టుబడిన విషయం తెలిసింది. హవాలా డబ్బును తరలిస్తూ అరెస్టయిన ఆరుగురిలో కిషన్‌బాగ్‌కు చెందిన రౌడీషీటర్ ఇమ్రానుద్దీన్ (28) కూడా ఉన్నాడు. హవాలా వ్యాపారంలో రౌడీలు కూడా తలదూర్చడం పోలీసులను ఆశ్చర్యానికి గురిచేసింది.
గుజరాత్ కేంద్రంగా నగరంలో నడుస్తున్న ఈ హవాలా రాకెట్లో నగరానికి చెందిన ఇంకెంత మంది రౌడీల హస్తం ఉంది? వీరికి ముంబై మాఫియాతో కూడా సంబంధాలున్నాయా.. అనే కోణాల్లో పోలీసులు ఆరా తీస్తున్నారు. తాజాగా హవాలా రాకెట్లో పట్టుబడి జైలు కెళ్లిన ఇమ్రానుద్దీన్ కరుడుగట్టిన రౌడీషీటర్. బహదూర్‌పురా ఠాణాలో రౌడీషీటర్‌గా రికారుల్లోకి ఎక్కిన ఇమ్రానుద్దీన్ అలియాస్ బబ్లూపై పీడీ యాక్ట్ ప్రయోగించేందుకు స్థానిక పోలీసులు కసరత్తు చేస్తున్నారు. స్థానికులను భయబ్రాంతులకు గురిచేయడంతో, బెదిరింపులకు పాల్పడటంతో కిషన్‌బాగ్ అసద్‌బాబానగర్‌కు చెందిన ఇమ్రానుద్దీన్‌పై బహదూర్‌పురా పీఎస్‌లో 2007లో రౌడీషీట్ తెరిచారు.
గ్యాంగ్ లీడర్‌గా వ్యవహరించేందుకు తోటి రౌషీటర్లతో పాటు ఎదురు తిరిగిన వారిని అణచివేసేందుకు దాడులకు పాల్పడేవాడు. బహదూర్‌పురా, కంచన్‌బాగ్, మలక్‌పేట్ పోలీస్స్టేషన్ల పరిధిలో జరిగిన మూడు హత్య కేసుల్లో ఇతను నిందితుడు. బహదూర్‌పురా ఠాణాలో ఇతనిపై మరో ఆరు కేసులున్నాయి. పోలీసులు ఇతడిని రెండుసార్లు నగర బహిష్కరణ చేశారు. అసద్బాబానగర్లోఆటో గ్యారేజీ నిర్వహించే ఇమ్రానుద్దీన్ ప్రస్తుతం శాలిబండలో ఉంటున్నాడు.
ఐటీ అధికారులకు నిందితుల అప్పగింత...
టాస్క్‌ఫోర్స్ పోలీసుల తనిఖీల్లో మంగళవారం పట్టుబడ్డ హవాలా డబ్బు రూ.1,90,49,700తో పాటు ఆరుగురు నిందితులు పటేల్ జసితేందర్ కుమార్ కాంజి భాయ్ అలియాస్ జిత్తు భాయ్ (42), పటేల్ నరేంద్ర (38), పటేల్ అలకేష్ (32), పటేల్ దినేష (32), కారు డ్రైవర్ మహ్మద్ రఫీ (44), రౌడీషీటర్ ఇమ్రానుద్దీన్ (28)లను నారాయణగూడ ఇన్స్పెక్టర్ భీంరెడ్డి బుధవారం ఇన్‌కంట్యాక్స్ అధికారులకు అప్పగించారు.