పెరిగిన పత్తి ధర
ఖమ్మం గాంధీచౌక్, న్యూస్‌లైన్: పత్తి ధర పెరిగింది. ప్రస్తుత సీజన్లో శుక్రవారం పత్తికి అధిక ధర లభించింది. ఖమ్మం వ్యవసాయ మార్కెట్లో గరిష్ట ధర క్వింటాలుకు రూ.4,575 పలికింది. గత కొద్ది రోజులుగా గరిష్టంగా రూ.4,250 నుంచి రూ.4,350 వరకు ఉండగా శుక్రవారం క్వింటాకు రూ.225 పెరిగింది. దేశ వ్యాప్తంగా పత్తి దిగుబడి తగ్గడమే ధర పెరుగుదలకు ప్రధాన కారణమని వ్యాపారులు అంటున్నారు. అయితే పంట చేతికందే సమయంలో కురిసిన వర్షాలతో పత్తికి చీడపీడలు సోకాయని, పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, మహరాష్ట్ర, గుజరాత్‌లలోనూ వర్షాలతో పంటల దిగుబడి, నాణ్యత తగ్గిందని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పారు. మిగితా రాష్ట్రాల్లో పోలిస్తే మన పత్తి కొంతమేర నాణ్యంగా ఉండడంతో దీనికి డిమాండ్ పెరుగుతోంది.
ఇక్కడ కొనుగోలు చేసిన సరుకును వ్యాపారులు మహరాష్ట్ర, తమిళనాడు, గుజరాత్‌లలోని జిన్నింగ్ మిల్లులకు ఎగుమతి చేస్తున్నారు. అక్కడ మిల్లుల యజమానులు, ఖరీదుదారులు ఆయా రాష్ట్రాల్లో కొనుగోలు చేసిన సరుకులో ఆంధ్రప్రదేశ్ నుంచి తెప్పించిన పత్తిని కలిపి(మిక్సింగ్) విక్రయిస్తారు. దీంతో అక్కడి పత్తికి కూడా మంచి ధర వస్తోందని వ్యాపారులు చెపుతున్నారు. అంతేగాక విదేశాల్లో కూడా పత్తికి డిమాండ్ పెరుగుతోందని, దీంతో ధర ఇంకా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. కాగా, కొందరు వ్యాపారులు ఇప్పుడే పత్తి కొని, నిల్వ చేసే ఆలోచనలో కూడా ఉన్నారు.