పింఛన్లను పునరుద్ధరించాలి
నిరవధిక నిరశనలో పూతలపట్టు ఎమ్మెల్యే
దీక్షకు పలువురు {పముఖుల మద్దతు
దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మంజూరుచేసిన పింఛన్లను తొలగించడమే ఈ ప్రభుత్వం పనిగా పెట్టుకుంది. ఐరాల మండలంలో 500 మంది వికలాంగులు.. 80 మందికి పైగా వితంతువులు, వృద్ధుల నోటికాడ కూడు లాగేసింది.
-డాక్టర్ సునీల్‌కుమార్, ఎమ్మెల్యే
ఐరాల: మండలంలో తొలగించిన పింఛన్లను పునరుద్ధరించాలని పూతలపట్టు ఎమ్మెల్యే సునీల్‌కుమార్ డిమాండ్ చేశారు. వివిధ వర్గాలకు సంబంధించిన పింఛన్ల తొలగింపును నిరసిస్తూ గురువారం ఐరాలలో ఎంపీడీవో కార్యాలయం వద్ద ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు. మండలవ్యాప్తంగా ఇటీవల తెలుగుదేశం ప్రభుత్వం కమిటీల ద్వారా తొలగించిన వారికి వెంటనే పింఛన్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. మండలంలో తొలగించిన పింఛన్లకు సంబంధించి అధికారులు చెబుతున్న లెక్కలకు, వాస్తవానికీ పొంతనే లేదన్నారు. మండలంలో మొత్తం 159 పింఛన్లు మాత్రమే తొలగించామని అధికారులు చెబుతుండగా, అనధికారికంగా వికలాంగులకు సంబంధించే మొత్తం 500 పింఛన్లు తొలగించేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేసిన పింఛన్లను తొలగించడమే ప్రభుత్వం పనిగా పెట్టుకుందని విమర్శించారు. అర్థంపర్థంలేని నియమాలు, నిబంధనలు అమలు చేసి ప్రజలను తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని ఆయన మండిపడ్డారు.
తరలివచ్చిన వికలాంగులు
మండలం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో వికలాంగులు, వృద్ధులు, వితంతువులు దీక్షా శిబిరానకి తరలివచ్చారు. తమకు అన్నిరకాల అర్హతలున్నా ప్రభుత్వం పింఛన్లు తొలగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. పింఛను పొందేందుకు ధ్రువపత్రాల్లో 50 శాతం మేర అర్హతలు కలిగి ఉన్నా తమకు పింఛన్లు అందడం లేదని వారు ఎమ్మెల్యేకు తెలిపారు. కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి వేసారి పోయామంటూ ఈడిగపల్లికి చెందిన మంజుల,చిన్నకాంపల్లికి చెందిన నాగరాజు, చెంగనపల్లికి చెందిన బాలయ్య మొరపెట్టు కున్నారు.
ప్రముఖుల మద్దతు
ఎమ్మెల్యే సునీల్ కుమార్ నిరాహరదీక్షకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కేంద్రపాలక మండలి సభ్యుడు పోకల అశోక్ కుమార్, శిరీష్ రెడ్డి, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గాయత్రీదేవి, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త జంగాలపల్లి శ్రీనివాసులు, నాయకులు రాజారత్నం రెడ్డి, సుబ్బారెడ్డి,వినయ్ రెడ్డి, కుమార్ రాజా, రామచంద్రారెడ్డి, శరత్ రెడ్డి,ప్రభాకర్ రెడ్డి,పుత్రమద్ది బుజ్జిరెడ్డి,ప్రభాకర్ రెడ్డి,గణపతి,రాజేష్, సురేష్,భానూప్రకాష్ రెడ్డి,చంద్ర శేఖర్ రెడ్డి,చిన్నారెడ్డి, టెరిన్ రెడ్డి,వికలాంగ జేఏసీ సభ్యులు చంద్ర శేఖర్,సర్పంచులు బుజ్జమ్మ,శ్రీనివాసులు, వెంకటేశు,ఎంపీటీసీ సభ్యురాలు చిలకమ్మ తదితరులు పాల్గొన్నారు.