23 అర్ధరాత్రి నుంచి లారీ రవాణా బంద్
తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటన
సాక్షి, హైదరాబాద్: లారీ యజమానులు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి విన్నవించినా స్పందన లేకపోవడంతో ఈ నెల 23 అర్ధరాత్రి నుంచి నిరవధిక లారీ రవాణా బంద్ చేపడుతున్నట్లు తెలంగాణ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రకటించింది. ఈ మేరకు సీఎం కేసీఆర్, రవాణా శాఖ మంత్రి మహేందర్‌రెడ్డికి శుక్రవారం లేఖ రాసింది. గతేడాది జూన్‌లో తమ సమస్యలపై ముఖ్యమంత్రికి విన్నవించినా పరిష్కారం లభించలేదని పేర్కొన్నారు.
త్రైమాసిక పన్ను తగ్గించాలని, కౌంటర్ సిగ్నేచర్ ద్వారా తెలంగాణ, ఏపీలో వాహనాలు తిరిగేలా అనుమతించాలని ఇప్పటికే ప్రభుత్వానికి విన్నవించింది. తాము ప్రభుత్వానికి సమర్పించిన 11 డిమాండ్లపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు భాస్కర్‌రెడ్డి, దుర్గాప్రసాద్ విజ్ఞప్తి చేశారు.