నెల్లూరు జిల్లాలో ఐఏఎఫ్ కేంద్రం
పొదలకూరు : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం మరుపూరు వద్ద తమకు కేటాయించిన ప్రభుత్వ భూమిలో భారత వైమానిక దళ(ఇండియన్ ఎయిర్‌ఫోర్స్) కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు చెన్నై వింగ్ కమాండర్ మణి పేర్కొన్నారు. ఎయిర్‌ఫోర్స్, రాడార్ కేంద్రం ఏర్పాటు కోసం స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహశీల్దార్ వి.కృష్ణారావు బుధవారం 63.6 ఎకరాల భూమిని ఐఏఎఫ్‌కు అప్పగిస్తూ కమాండర్ మణికి స్వాధీనపత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మణి మాట్లాడుతూ శత్రుదేశాల నుంచి ముప్పును పసిగట్టేందుకు మరుపూరు వద్ద రాడార్‌కు సిగ్నల్స్ బాగా అందుతుండటంతో ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు. త్వరలో ఇక్కడ 100 నివాసాలతో కూడిన మంచి టౌన్షిప్ ఏర్పడుతుందన్నారు. కొంతభూమి కోర్టు పెండింగ్‌లో ఉన్నందున మలి విడతలో కేటాయిస్తామని తహశీల్దార్ తెలిపారు. అనంతరం వింగ్ కమాండర్ మణి, వాలెంట్ అధికారి రాజేష్‌తో కలసి తహశీల్దార్ భూములను పరిశీలించారు.