నాడు శిక్ష తప్పినా.. నేడు కక్ష కాటేసింది
ప్రత్తిపాడు : వారిద్దరూ బంధువులు. అంతేకాదు.. 24 ఏళ్ల కిందట ఒక హత్య కేసులో నిందితులు కూడా. కొన్నాళ్లు జైలు శిక్ష అనుభవించారు. చివరకు సుప్రీం కోర్టులో కేసు వీగిపోవడంతో బయటపడ్డారు. వారే మూడేళ్లుగా శత్రువులుగా మారారు. ఇంటి దారి విషయంపై వివాదం పగను రగిల్చింది.దాని ఫలితమే మంగళవారం గజ్జనపూడిలో చోటుచేసుకున్న దారుణ ఘటన. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో బొబ్బిలి సత్యనారాయణ, అతడి ఇద్దరు కుమారులను గారా తాతాబ్బాయి వర్గీయులు పాశవికంగా చంపిన విషయం తెలిసిందే.
దీంతో గ్రామంలో నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. సత్యనారాయణ, తాతాబ్బాయిలు బంధువులే. వీరిద్దరు 1990లో ఒక హత్య కేసులో నిందితులు కాగా న్యాయస్థానం జీవితఖైదు విధించింది. అయితే సుప్రీంకోర్టు కేసు కొట్టివేయడంతో కేసు నుంచి బయట పడ్డారు.ఇంటిదారి విషయంలో మూడేళ్లుగా జరగుతున్న గొడవ ఈ ఘాతుకానికి కారణమైంది. ఈ నేపథ్యంలో తాతబ్బాయితో పాటు 12 మంది పథకం ప్రకారం కత్తులతో దాడిచేసి సత్యనారాయణ, అతడి ఇద్దరు కొడుకులు లక్ష్మీనారాయణ, అర్జుబాబులను హత్య చేశారు. మృతదేహాలకు బుధవారం ప్రత్తిపాడు కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో శవపరీక్ష నిర్వహించారు. హతుడు లక్ష్మీనారాయణ భార్య గంగాభవాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.
మిన్నంటిన రోదనలు
పోస్టుమార్టం కోసం బుధవారం సత్యనారాయణ, అతని ఇద్దరు కొడుకుల మృతదేహాలను గజ్జనపూడి నుంచి ప్రత్తిపాడు సీహెచ్‌సీకి పోలీసులు తరలించారు. మృతుల బంధువులు, భార్యాపిల్లలు అక్కడకు చేరుకున్నారు. సత్యనారాయణకు నలుగురు కుమారులు. పెద్ద కుమారుడు లక్ష్మీనారాయణకు భార్య గంగాభవాని, కుమార్తెలు శివదుర్గ, లోవలక్ష్మి (8వ తరగతి), కుమారుడు అయ్యప్పస్వామి (5వ తరగతి) ఉన్నారు. మూడో కుమారుడు అర్జుబాబుకు భార్య సత్యవతి, కుమార్తె సింధు (3), ఏడాది వయసున్న కనకారావు సంతానం.
పారిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం
పథకం ప్రకారం తన తండ్రి, సోదరులను హత్య చేశారని సత్యనారాయణ మిగిలిన ఇద్దరు కుమారులు వీరబాబు, త్రిమూర్తులు విలపించారు. కాలు దెబ్బతిన్న గేదెకు కట్టుకట్టే ప్రయత్నంలో ఉన్న తన తండ్రి, సోదరులను కత్తులతో నరికి హత్య చేశారని తెలిపారు. ఆ సమయంలో తాము సమీప పొలంలో గొర్రెలను మేపుతున్నామని, సంఘటన విషయం తెలిసిన వెంటనే తాము పారిపోయామన్నారు. ప్రత్తిపాడు సీహెచ్‌సీ వద్ద పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్, సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ కేంద్ర కమిటీ సభ్యుడు బుగతా బంగార్రాజు, రేచుకట్ల సింహాచలం, మానుకొండ లచ్చబాబు, టీడీపీ నాయకులు పర్వత సురేష్, పల్లా గోపి, కొమ్ముల కన్నబాబు, గజ్జనపూడి సర్పంచ్ శింగిడి వెంకటేష్, గొనగాల వెంకటరమణ తదితరులు మృతుల కుటుంబాలను పరామర్శించారు.
రెండు దశాబ్దాల కిందట..
రెండు దశాబ్దాల క్రితం అంటే 1990లో... ఇండియన్ పీపుల్స్ ఫ్రంట్ (ఐపీఎఫ్) ఆధ్వర్యంలో భూముల స్వాధీన ఉద్యమం ఉధృతంగా సాగుతోంది. ఆ సమయంలో బుగత బంగార్రాజు, పల్లా నూకరాజు తదితరులపై పోలీసులు టాడా కేసులు నమోదు చేసి, జైలుకు పంపారు. ఈ కేసులకు కారకుడుగా భావించి, గారా తాతబ్బాయి (నిందితుడు), బొబ్బిలి సత్యనారాయణ (హతుడు) తదితరులు గజ్జనపూడిలో మొల్లి అప్పారావు అనే వ్యక్తిని కత్తులు, బళ్లేలతో దాడి చేసి, హత్య చేశారు. ఆ సమయంలో పౌరహక్కుల నేత దివంగత కె.బాలగోపాల్ గజ్జనపూడి సందర్శించారు. ఈ కేసులో సత్యనారాయణ, తాతబ్బాయిలకు జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. దీనిని హైకోర్టు కూడా ఖరారు చేసింది.సుప్రీం కోర్టులో అప్పీలు చేసుకుని, కేసు నుంచి బయటపడ్డారు. వారిద్దరి తరఫున ఈ కేసును పౌర హక్కుల ఉద్యమ నేత కేజీ కన్నాభిరాన్ వాదించారు. ఈ కేసులో తాతబ్బాయి, సత్యనారాయణ నాలుగేళ్ల పాటు రాజమండ్రి జైలులో ఉన్నారు.
పోస్టుమార్టం పూర్తి
ప్రత్తిపాడు మండలం గజ్జనపూడి గ్రామంలో హత్యకు గురైన ముగ్గురి మృతదేహాలకు బుధవారం స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో పోస్టుమార్టం పూర్తయ్యింది. గజ్జనపూడిలో మంగళవారం సాయంత్రం బొబ్బిలి సత్యనారాయణ, అతడి కొడుకులు లక్ష్మినారాయణ, అర్జుబాబులను గారా తాతబ్బాయి వర్గీయులు కత్తులతో దాడి చేసి, అత్యంత కిరాతకంగా హతమార్చిన విషయం తెలిసిందే. మృతదేహాలను పోలీసులు బుధవారం ఉదయం స్థానిక సీహెచ్‌సీకి తరలించారు. వాటికి వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం బంధువులకు అప్పగించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు, ప్రత్తిపాడు, జగ్గంపేట సీఐలు సూర్యనారాయణ, సుంకర మురళీమోహన్, ఎస్సై వై.రవికుమార్‌లు పోస్టుమార్టం పూర్తయ్యేవరకు సీహెచ్‌సీలోనే ఉన్నారు. పెద్దాపురం ఆర్డీఓ కూర్మానాథ్ సీహెచ్‌సీకి చేరుకుని, మృతుల కుటుంబీకులను పరామర్శించారు. పెద్దాపురం డీఎస్పీ అరవిందబాబు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.