మౌలిక వసతుల్లో నగరమే బెస్ట్: మంత్రి పొన్నాల
అమీర్‌పేట, న్యూస్‌లైన్: రానున్న స్వల్ప కాలంలో హైదరాబాద్.. మలేషియాకు దీటుగా అభివృద్ధి సాధిస్తుందని, ఇదే విషయాన్ని సర్వేలు స్పష్టం చేస్తున్నాయని రాష్ట్ర ఐటీ, కమ్యూనికేషన్ శాఖ మంత్రి పొన్నాల లక్ష్మయ్య తెలిపారు. ఇండియన్ సొసైటీ ఆఫ్ లైటింగ్ ఇంజినీర్స్ (ఐఎస్ఎల్ఈ) హైదరాబాద్ చాప్టర్ ప్రారంభోత్సవం గురువారం సాయంత్రం అమీర్‌పేట్ గ్రీన్‌పార్కు హోటల్లో ఏర్పాటు చేశారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నాల మాట్లాడుతూ.. హార్డ్‌వేర్ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం తరుపున రాయితీలు ఇస్తున్నామని, ఐటీ, ఫార్మా.. ఏ రంగానికైనా హైదరాబాద్ అనుకూల వేదికగా ఉందన్నారు. అందుకే ప్రపంచ దేశాలు ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ఉత్సాహం చూపుతున్నాయన్నారు. దేశంలో మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ మౌలిక సదుపాయాల పరంగా ముందంజలో ఉందన్నారు.
శంషాబాద్ ఎయిర్పోర్ట్ సమీపంలో వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో హార్డ్‌వేర్ పార్కు ఏర్పాటు కోసం కేంద్ర ప్రభుత్వం రూ.500 కోట్లు విడుదల చేయనుందని, దీని ద్వారా ఉపాధి అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఐఎస్ఎల్ఈ ఏపీ సెంటర్ చైర్మన్ కృష్ణశాస్త్రి, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాసమూర్తి, కర్ణాటక సెంటర్ చైర్మన్ నర్సింహస్వామి పాల్గొన్నారు.