‘ఇందిరమ్మ’ అక్రమార్కుల్లో గుబులు..
అవకతవకలపై సీఐడీకి హౌసింగ్ పీడీ ఫిర్యాదు
ప్రాథమిక స్థాయిలో వివరాల సేకరణ షురూ
నేటి నుంచి వేగం పుంజుకోనున్న విచారణ
రంగంలోకి క్షేత్రస్థాయి తనిఖీ బృందాలు
వరంగల్: ఇందిరమ్మ పథకం ద్వారా చేపట్టిన గృహ నిర్మాణాల్లో అవకతవకలపై సీఐడీ విచారణ ప్రారంభం కావడంతో అక్రమార్కుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. గృహ నిర్మాణాల్లో జరిగిన అక్రమాలను వెలికితీయూలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం సీఐడీ విచారణకు ఆదేశించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా జిల్లాలో గృహ నిర్మాణ శాఖ పీడీ ఫిర్యాదుతో శుక్రవారం కేసు నమోదైంది. సీఐడీ డీఎస్పీ సంజీవ్‌కుమార్ ఆధ్వర్యంలో ప్రాథమిక స్థాయిలో వివరాల సేకరణ ఇప్పటికే మొదలైంది.
గ్రామాల్లో క్షేత్రస్థాయి పరిశీలన చేసేందుకు ప్రణాళిక రూపొందించే పనిలో సీఐడీ నిమగ్నమైంది. తనిఖీ బృందాలను రంగంలోకి దింపే అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. సోమవారం నుంచి కేసు దర్యాప్తు ముమ్మరమయ్యే అవకాశాలు ఉండడంతో అవినీతి అధికారులు, సిబ్బంది, దళారులు, బోగస్ లబ్ధిదారుల్లో గుండె దడ మొదలైంది.
2008 తర్వాత భారీగా అక్రమాలు
2004 నుంచి 2014 వరకు మంజూరైన గృహాలపై సీఐడీ బృందం దర్యాప్తు చేయనున్నట్లు సమాచారం. ప్రధానంగా జిల్లాలో 2008 తర్వాత భారీగా అక్రమాలు జరిగాయనే అరోపణలున్నాయి. రేగొండ, పాలకుర్తి, నర్సింహుపేట, చిట్యాల, మొగుళ్లపల్లి ప్రాంతాల్లో ఎక్కువగా అవకతవకలు జరిగినట్లు థర్డ్ పార్టీ విచారణలో తేలింది. అప్పుడు ప్రాథమిక స్థాయిలో మాత్రమే వివరాలు సేకరించినట్లు సీఐడీ అధికారులు అంచనాకు వచ్చారు. 2008 తర్వాత మహిళా సంఘాల ద్వారా చెల్లింపులు చేపట్టిన సమయంలో భారీ కుంభకోణాలు జరిగాయని నిర్ధారించారు. ఈ మేరకు లోతుగా విచారణ జరిపేందుకు వారు సమాయత్తమవుతున్నారు.
జిల్లాలో 2007 నుంచి 2014 వరకు 4,75,567 గృహాలు మంజూరు చేశారు. ఇందులో 1,33,861 ఇళ్లు ఇప్పటివరకు ప్రారంభించలేదు. 75,663 నిర్మాణాలు వివిధ దశల్లో కొనసాగుతున్నాయి. పునాది, బెడ్‌లెవల్, లెంటల్ లెవల్ తదితర స్థాయిల్లో ఈ ఇళ్లు ఉన్నట్లు అధికారుల రికార్డులు చెబుతున్నాయి. 2,66,043 ఇళ్లు మాత్రం ఇప్పటికే పూర్తయిన ట్లు పేర్కొన్నారు. మొత్తంగా రూ.1180,89,29,263 లబ్ధిరులకు చెల్లించనట్లు చెబుతున్నారు. ఇందులో 83,36,208 సిమెంట్ బస్తాలు, మెటీరియల్ చార్జీలు ఉన్నాయి. ఈ చెల్లింపుల్లో ఏ మేరకు లబ్ధిదారులకు అందాయో... అక్రమాల్లో ఎవరిపాత్ర ఎంతో విచారణలో తేలనుంది.