విమానం కుప్పకూలి.. 113 మంది మృతి!
ఇండోనేసియాలోని మెడాన్ నగరంలో గల నివాస ప్రాంతంలో ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన రవాణా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో 113 మంది మరణించినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాంతంలో భవనాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి, కార్లు కూడా బూడిద కుప్పలుగా మారాయి. సహాయక బృందాలు పెద్ద ఎత్తున వెంటనే రంగంలోకి దిగాయి. ప్రమాద స్థలం నుంచి మృతదేహాలను వెలికితీస్తున్నారు. తమవాళ్లకు ఏమయిందో అని చుట్టుపక్కల వాళ్లు ఆందోళనగా అక్కడ గుమిగూడారు. తాను అక్కడకు సమీపంలోనే ఉండే ఓ ఇంటర్నేషనల్ స్కూల్లో పనిచేస్తానని, విమానం బాగా కింద నుంచి వెళ్తూ ఒక్కసారిగా కూలిపోవడాన్ని తన కిటికీలోంచి చూశానని నోవి అనే టీచర్ చెప్పారు. అది చాలా భయంకరంగా ఉందని ఆమె అన్నారు. ప్రమాద స్థలం వద్ద ఎక్కడ చూసినా పొగలు, శిథిలాలే కనపడుతున్నాయి. విమానంలో 12 మంది సిబ్బంది ఉన్నారు.
వారిలో ఎవరైనా బతికారా లేదా అన్న విషయం మాత్రం ఇంకా తెలియలేదు. వారిలో ముగ్గురు పైలట్లు, ఒక నేవిగేటర్, 8 మంది టెక్నీషియన్లు ఉన్నారు. ప్రమాదం జరిగే సమయానికి ఆ ప్రాంతంలోని భవనాల్లో ఎంతమంది ఉన్నారో కచ్చితంగా తెలియట్లేదు. భవన శిథిలాల కింద చాలా మృతదేహాలు ఉండొచ్చని ఆందోళన వ్యక్తమవుతోంది. విమానం బయల్దేరిన రెండు నిమిషాలకే అది కూలిపోయింది. మెడాన్లో ఈ దశాబ్దంలో ఇది రెండో విమాన ప్రమాదం. గతంలో 2005 సంవత్సరంలో మండలా ఎయిర్‌లైన్స్‌కు చెందిన ప్రయాణికుల విమానం బాగా రద్దీగా ఉండే ప్రాంతంలో కూలిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు, సిబ్బంది, స్థానికులు సహా 150 మంది మరణించారు.