టీడీపీలోని బడా వ్యాపారుల కోసమే 'తాత్కాలిక రాజధాని'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తాత్కాలిక రాజధానిగా విజయవాడను ప్రకటించడం తగదని రాయలసీమ రాజధాని సాధన సమితి (ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్) అభిప్రాయపడ్డింది. గురువారం హైదరాబాద్‌లో ఆ సంస్థ ప్రతినిధులు విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ.... టీడీపీలోని బడా వ్యాపారులకు లబ్ది చేకూర్చేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఆ ప్రకటన చేసిందని ఆరోపించారు. రాయలసీమలోనే ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏర్పాటు చేయాలని వారు డిమాండ్ చేశారు. లేదంటే మరో ఉద్యమం రాష్ట్రంలో ఉద్బవిస్తుందని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
శ్రీబాగ్ ఒప్పందాన్ని ప్రభుత్వం ఖచ్చితంగా అములు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. రైతుల రుణమాఫీకి డబ్బులు లేవని చెబుతున్న ప్రభుత్వం... విజయవాడలో భూ సేకరణకు రూ. 40 వేల కోట్లు ఎలా పెడుతున్నారని ఆర్‌ఆర్‌ఎస్‌ఎస్ ప్రతినిధులు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఆగస్టు 16న ధర్నా చౌక్‌లో ఏపీ సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దహనం చేస్తామని వారు వెల్లడించారు.