నాపరాయి కష్టాలు
♦ గ్రానైట్, టైల్స్ రావడంతో తగ్గిన వ్యాపారాలు
♦ వంద దాకా మూతపడిన పరిశ్రమలు
♦ రోడ్డున పడుతున్న కార్మికులు
♦ అయోమయంలో యజమానులు
ఎర్రగుంట్ల : జిల్లాలోని పేరెన్నికగన్న నాపరాయి పరిశ్రమకు గడ్డు కాలం దాపురించింది. ఒకప్పుడు దేశవిదేశాలలో ఈ రాయికి యమ డిమాండ్ ఉండేది. వీటి యజమానులకు, ఆ పరిశ్రమపై ఆధారపడిన కూలీలకు ఉపాధి పుష్కలంగా ఉండేది. కాలక్రమేణ ఇతర ప్రాంతాల నుంచి గ్రానైట్, టైల్స్ ఆధునిక డిజైన్లతో రావడం, వాటి వినియోగం పెరగడంతో నాపరాయి పరిశ్రమలు మూత దిశగా ఉన్నాయి.
రాయలసీమలో ఒకప్పుడు పెద్ద సంఖ్యలో కూలీలు నాపరాయి పరిశ్రమ ద్వారా ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో సుమారు ఈ పరిశ్రమలు 200 దాకా ఉండేవి. వీటిపై ఆధారపడి సుమారు 20 వేలకు పైగానే కూలీలు ఉపాధి పొందేవారు. ఎర్రగుంట్లలో నాపరాయి వ్యాపారం ఆరు దశాబ్దలుగా డిల్లీ నుంచి గల్లీ వరకు మూడు పువ్వులు ఆరు కాయలు అన్నట్టు కొనసాగేది. చుట్టు పక్కల గ్రామాల ప్రజలకు ఉపాధి ఉండేది. మొదట్లో రాళ్లను చేత్తో తొలచి మొలలు ద్వారా రాళ్లను చదరపు సైజలు తయారు చేసేవారు. నాపరాయి పరిశ్రమకు గనులు నుంచి ఎద్దుల బండలపై చేర్చేవారు. తరువాత కాలక్రమేణ లారీలు, ట్రాక్టర్ల రావడంతో వాటి ద్వారా తరలించేవారు. అటు తరువాత కొత మిషన్ వచ్చి గనులలో రాళ్లను సులభతరంగా రాళ్లను తీసి పరిశ్రమలకు చేర్చేవారు.
ఇతర ప్రాంతాలకు ఎగుమతి
ఇలా తీసిన రాళ్లను పరిశ్రమలకు చేర్చి వాటిని వివిధ ఆకారాలలో, సైజులలో అందంగా తయారీ చేసి వాటిని కోల్‌కతా, ముంబై, డిల్లీ, తమిళనాడు రాష్ట్రంతోపాటు న్యూజిల్యాండ్, సింగపూర్ తదితర దేశాలకు ఎగుమతి చేసేవారు.గతంలో నిత్యం నాపరాయి లోడింగ్, అన్ లోడింగ్ వ్యాపారాలతో ఉండే ఈ పరిశ్రమ యజమానులు బిజీగా ఉండేవారు. గతంలో ప్రభుత్వ కార్యాలయాలకు, ఇళ్ల ముందు ముతక రాళ్లతో చప్పటి వేసేవారు. ఈ రాయిని ఎగుమతి చేసే ట్రేడర్లకు ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో అర్డర్లు వచ్చేవి.
ఇప్పుడు ఆ పరిస్థితి భిన్నం
కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని పరిశ్రమ యజమానులు వాపోతున్నారు. వ్యాపారం లేక పరిశ్రమలు మూత పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వారం వచ్చింది అంటే చాలు కూలీ ఖర్చులు కూడా రాలేదంటున్నారు ఇంటిలోని బంగారు నగలను బ్యాంకులో కుదవ పెట్టి రుణాలు, కూలీల డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి ఉందని వారు వాపోయారు. ప్రస్తుతం గ్రానైట్, టైల్స్ వ్యాపారం ఎక్కువ కావడంతో గడ్డు నాపరాయి పరిశ్రమకు గడ్డు పరిస్థితి ఏర్పడింది. వ్యాపారాలు సన్నగిల్లడం వల్ల పరిశ్రమ యజమానులు దిక్కుతోచని పరిస్థితి ఉన్నారు. వ్యాపారాలపై తెచ్చుకున్న రుణాలు చెల్లించలేక పరిశ్రమలు మూతలు వేసుకునే పరిస్థితి వచ్చింది. దీనికి తోడు మున్సిపాలిటీ పన్నులు అధికంగా ఉండడంతో యజమానులు అయోమయంలో పడ్డారు.
నాపరాయికి గడ్డుకాలం
ఇంతటి ప్రాధాన్యత గల నాపరాయి పరిశ్రమకు ప్రస్తుతం గడ్డుకాలం వచ్చింది. చాలా వరకు పరిశ్రములు మూత పడ్డాయి. దీనికి కారణం గ్రానైట్ , టైల్స్‌తో పాటు అత్యనిధుక డిజైన్లుతో టైల్స్ రావడం వల్ల పరిశ్రమ దెబ్బతింది. ఇలా వ్యాపారం డీలా పడడంతో బ్యాంకుల అప్పులు కట్టలేక వ్యయం భరించలేక మూడు సంవత్సరాలుగా సుమారు వంద పరిశ్రమలు దాకా మూతపడ్డాయి. ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి కడప నాపరాళ్లను వినియోగించుకుంటే పరిశ్రమ కొంత వరకు నష్టాల నుంచి గట్టెక్కెతుందని పరిశ్రమ యజమానులు అంటున్నారు.