కోలుకున్న భారత్ ‘ఎ’
తొలి ఇన్నింగ్స్లో 165/3
బ్రిస్బేన్: ఆస్ట్రేలియా ‘ఎ’తో జరుగుతున్న రెండో అనధికారిక టెస్టు మ్యాచ్లో భారత్ ‘ఎ’ తడబడింది. మ్యాచ్ రెండో రోజు సోమవారం ఆట ముగిసే సమయానికి భారత్ ‘ఎ’ తమ తొలి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 165 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ (102 బంతుల్లో 52; 7 ఫోర్లు, 1 సిక్స్), మనోజ్ తివారి (74 బంతుల్లో 50; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు చేశారు. చాడ్ సాయెర్స్ (3/22) ధాటికి ఒక దశలో భారత్ 96 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే తివారి, అపరాజిత్ (20 బ్యాటింగ్) నాలుగో వికెట్కు అభేద్యంగా 69 పరుగులు జోడించి పరిస్థితిని చక్కదిద్దారు. ప్రస్తుతం భారత్ మరో 258 పరుగులు వెనుకబడి ఉంది.
అంతకు ముందు 288/7 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ఆట ప్రారంభించిన ఆసీస్ చివరి 3 వికెట్లకు 135 పరుగులు జత చేయడం విశేషం. బెన్ కటింగ్ (117 బంతుల్లో 96; 5 ఫోర్లు, 4 సిక్సర్లు), కామెరాన్ బోయ్స్ (102 బంతుల్లో 57; 9 ఫోర్లు) చెలరేగడంతో ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్లో 423 పరుగులు చేసింది. ఉమేశ్ యాదవ్ 83 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టాడు.