ధరల కట్టడిని ప్రజలు కోరుతున్నారు
సిమ్లా: ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ప్రధాన సాధనమని గవర్నర్ రఘురామ్ జీ రాజన్ పేర్కొన్నారు. జూన్ 3 ఆర్బీఐ ద్వైమాసిక పరపతి సమీక్ష నేపథ్యంలో రాజన్ ఈ వ్యాఖ్య చేశారు. గురువారం ఇక్కడ జరిగిన బోర్డ్ సమావేశం అనంతరం రాజన్ విలేకరులతో మాట్లాడారు. భారత ప్రజలు ధరల తగ్గుదలను కోరుకుంటున్నారని అన్నారు. ఈ విషయంలో తగిన అన్ని చర్యలనూ ఆర్బీఐ తీసుకుంటుందని స్పష్టం చేశారు.
ప్రభుత్వానికీ సాధనలు...
ప్రభుత్వానికీ ద్రవ్యోల్బణం కట్టడికి సాధనాలు ఉన్నాయని రాజన్ అన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, సరఫరాల మెరుగుదల వంటి అంశాలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. ద్రవ్యోల్బణాన్ని అరికట్టడానికి ఆర్బీఐ, ప్రభుత్వం కలసి పనిచేయాల్సి ఉంటుందని, అదే విధంగా ముందుకు సాగుతాయని సైతం స్పష్టం చేశారు.
ప్లాస్టిక్ నోట్లు వస్తున్నాయ్
ప్లాస్టిక్ నోట్లను వచ్చే ఏడాది ప్రవేశపెడతామని రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ రఘురామ్ రాజన్ గురువారం తెలిపారు. వంద కోట్ల నోట్లకు టెండర్ పిలిచామని, బిడ్లు కూడా దాఖలయ్యాయని వివరించారు. ముందుగా ఈ ఏడాది ద్వితీయార్థంలో సిమ్లా సహా మరో నాలుగు నగరాల్లో వీటిని ప్రయోగాత్మకంగా ప్రవేశపెడతామని, ఆ ఫలితాల ఆధారంగా వచ్చే ఏడాది ఈ ప్లాస్టిక్ నోట్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామన్నారు. రూ. 10 డినామినేషన్లో ఉన్న వంద కోట్ల ప్లాస్టిక్ నోట్లను ఐదు నగరాల్లో ప్రవేశపెట్టనున్నామని ఈ ఏడాది ఫిబ్రవరిలోనే ప్రభుత్వం వెల్లడించింది.
ఆ బాధ్యత ప్రభుత్వానిదే
నల్ల ధనం నిరోధం ప్రభుత్వ బాధ్యతని, ఈ విషయంలో ఆర్బీఐ ప్రత్యక్షంగా జోక్యం చేసుకోదని రాజన్ వివరించారు. విదేశీ మారక ద్రవ్య లావాదేవీల తనిఖీల్లో భాగంగా నల్లధన సంబంధిత చర్యలను గుర్తించామని పేర్కొన్నారు. ఈ విషయమై ప్రభుత్వంతో కలిసి పనిచేస్తామని చెప్పారు. అయితే విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని భారత్కు తీసుకురావమనేది ప్రభుత్వ ప్రాథమిక బాధ్యతల్లో ఒకటని ఆయన వివరించారు.