భార్యా హంతకునికి జీవితఖైదు
హైదరాబాద్: అదనపు కట్నం కోసం భార్యను వేధించి, ఆమెపై కిరోసిన్ పోసి తగుటబెట్టిన కసాయి భర్తకు నాంపల్లి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. అలాగే రూ. వెయ్యి రూపాయలు జరిమానా చెల్లించాలని మూడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కె.రాజ్‌కుమార్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరఫున అదనపు పీపీ ఎస్.లోకేశ్వర్‌రెడ్డి వాదనలు వినిపించారు.
బంజారాహిల్స్ ఎన్బీటీ నగర్‌కు చెందిన సంగం యోగేష్‌కు అదే ప్రాంతానికి చెందిన రాణితో 2004 మే 30న వివాహం జరిగింది. కొద్ది రోజులపాటు వీరి సంసారం సజావుగానే సాగినా... యోగేష్ మద్యానికి బానిస కావడంతో వీరి కాపురంలో కలతలు ప్రారంభమయ్యాయి. మద్యానికి డబ్బులు ఇవ్వాలంటూ యోగేష్ తరచుగా భార్యతో ఘర్షణపడుతుండేవాడు.
ఈ క్రమంలో 2010 డిసెంబర్ 10న రాణితో ఘర్షణ పడిన యోగేష్ ఆమెపై కిరోసిన్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో వీరి పాప కూడా తీవ్రంగా గాయపడింది. వీరిద్దరినీ స్థానికులు ఆస్పత్రికి తరలించగా రాణి చికిత్స పొందుతూ మృతి చెందింది. యోగేష్ తనపై కిరోసిన్ పోసి తగులబెట్టాడడని రాణి తన మరణవాంగ్మూలంలో పేర్కొంది.