అంబులపొదిలో ఐఎన్ఎస్ కమోర్తా
* యుద్ధనౌకను జాతికి అంకితం చేసిన రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ
* స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన జలాంతర్గాముల విధ్వంసక యుద్ధనౌక
* పొరుగుదేశాలతో సత్సంబంధాలనే కోరుకుంటున్నాం: మంత్రి
* విదేశాలకు దీటుగా భారత నౌకా నిర్మాణం
విశాఖపట్నం: భారత నావికాదళ అంబుల పొదిలో మరో బ్రహ్మాస్త్రం చేరింది. శత్రు దేశాల జలాంతర్గాముల సింహస్వప్నంగా నిలిచే అత్యాధునిక స్టెల్త్ యుద్ధనౌక ‘ఐఎన్ఎస్ కమోర్తా’ భారత నావికాదళంలో భాగస్వామి అయింది. స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఈ అత్యాధునిక యుద్ధనౌకను కేంద్ర రక్షణ మంత్రి అరుణ్‌జైట్లీ శనివారం జాతికి అంకితం చేశారు. విశాఖపట్నం నేవల్‌బేస్‌లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, మన దేశ సముద్రజలాల్లోకి చొరబడే శత్రుదేశాల జలాంతర్గాములను గుర్తించి విధ్వసం చేయగల సత్తా కమోర్తా సొంతమన్నారు. యాంటీ సబ్‌మెరైన్ వార్‌షిప్ (ఏఎస్‌డబ్ల్యూ) కొర్వెట్టే తరహాలో నిర్మించ తలపెట్టిన నాలుగు అత్యాధునిక కొర్వెట్టే యుద్ధనౌకల్లో ఇది మొదటిదని తెలిపారు. ఈ జలాంతర్గాముల విధ్వంసక నౌక డిజైన్ భారత నౌకాదళమే చేసిందని జైట్లీ వెల్లడించారు. ఐఎన్ఎస్ కమోర్తా 2013లో సీ ట్రయిల్స్ నిర్వహించారని, 2014 జూలై 12న భారత నావికా దళానికి నిర్మాణ సంస్థ గార్డెన్ రీచ్ షిప్‌బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ (జీఆర్ఎస్ఈ) అప్పగించిదన్నారు.
పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో 190 యుద్ధనౌకలు, జలాంతర్గాముల్ని నిర్మిం చేందుకు రక్షణ శాఖ ప్రణాళిక రూపొందించగా అందులో 42 నిర్మాణదశలో ఉన్నాయని ఆయన తెలిపారు. అతిపెద్ద తీరప్రాంతం కలిగిన భారత్ పొరుగు దేశాలతో సత్సంబంధాలనే కాంక్షిస్తోందని అరుణ్ జైట్లీ చెప్పారు. విదేశీ పరిశ్రమలకు దీటుగా భారత్‌లో నౌకా నిర్మాణ పరిశ్రమ ఎదుగుతోందన్నారు. దేశంలోని ప్రైవేటు నిర్మాణ సంస్థలు సైతం రక్షణ శాఖ పీఎస్‌యూలతో పోటీపడుతున్నాయన్నారు. నౌకా నిర్మాణ రంగంలో హిందుస్థాన్ షిప్‌యార్డుకు అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామన్నారు. నావికాదళ చీఫ్ అడ్మిరల్ ఆర్కే ధోవన్ మాట్లాడుతూ, హిందూ మహాసముద్రంలో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత నావికాదళం సర్వసన్నద్ధంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈఎన్సీ చీఫ్ వైస్ అడ్మిరల్ సతీశ్ సోనీ, జీఆర్ఎస్ఇ ఎండీ రియర్ అడ్మిరల్ (రిటైర్డ్) ఎ.కె. వర్మ, కమోర్తా కమాండింగ్ అధికారి కమాండర్ మనోజ్ ఝా తదితరులు పాల్గొన్నారు.
కమోర్తా విశిష్టతలు ఇవీ..
- 110 మీటర్ల పొడవుతో 3,500 టన్నుల బరువుంటుంది.
- 25 నాటికల్ మైళ్ల వేగంతో దూసుకుపోతూ ఏకధాటిగా 3,450 నాటికల్ మైళ్ల వరకు వెళ్లగలదు.
- నౌక ఉపరితలం మీదనుంచి గాలిలో లక్ష్యాల్ని చేధించడానికి వీలుగా క్షిపణులు మోహరించి ఉంటాయి.
- యుద్ధనౌక ముందుభాగంలోని మెయిన్ గన్ 16 నాటికన్‌మైళ్ల లక్ష్యాల్ని చేధించగలదు.
- ముందుభాగంలోనే ఉండే సోనార్ లక్ష్యాల్ని సులభంగా గుర్తించగలగుతుంది.
- 13 మంది అధికారులు, 173 నావికులు కమోడోర్ మనోజ్ ఝా నేతృత్వంలో నిరంతరం సేవలందిస్తారు.
- 1971లో ఐఎన్ఎస్ విక్రాంత్‌కు మార్గనిర్దేశం చేసిన విమాన వాహన నౌక కమోర్తా పేరును ఈ యుద్ధనౌకకు పెట్టారు.
- అండమాన్,నికోబార్ ద్వీప సముదాయంలోని ఓ ద్వీపం పేరే కమోర్తా.
- ఈ యుద్ధనౌక డిజైన్‌ను డైరక్టరేట్ నావల్ డిజైన్ (డీఎన్డీ) రూపొందించింది.
- ఐఎన్ఎస్ కమోర్తా తరహా నౌక తొలుత 1965లో యూఎస్ఎస్ఆర్ నుంచి సబ్‌మెరైన్ చేజర్స్ నౌకగా భారత నావికా దళంలోకి చేరింది.
- అది 1971 పాక్ యుద్ధంలోనూ, 1987 అమన్ ఆపరేషన్స్, 1989 పవన్ ఆపరేషన్స్, 1991 తషా ఆపరేషన్స్ తదితరాల్లో పాల్గొని 1991 అక్టోబర్ 31న సేవలు విరమించింది.