టక్కు చెదరకుండా ‘స్ట్రాప్ గాడ్జెట్’
లండన్: టక్ చేసుకొని తిరిగే వారిని రోజు ఎంతోమందిని చూస్తుంటాం. ఎంత వారికైనా ఏదో సందర్భంలో ప్యాంట్ నుంచి చొక్కా బయటకు రావడం, దాన్ని ఎప్పటికప్పుడు లోపలకి దోపుకోలేక ఇబ్బందులు పడడమూ చూస్తాం. మొహమాటగాళ్లయితే టాయ్‌లెట్ ఎక్కడుందో వెతికి పట్టుకొని మరి అందులో దూరి టక్‌ను సరి చేసుకోవడమూ పరిపాటే. ముఖ్యంగా సేల్స్‌మేన్ జాబులు చేసే వారికి ఇలాంటి ఇబ్బందులు మరీ ఎక్కువ. అందుకనే ‘ఫ్యాషన్ జిగ్మో’ బ్రాండ్ కంపెనీ ‘సిగ్నేచర్ షర్ట్ స్టేస్’ పేరిట కొత్త గాడ్జెట్‌ను తీసుకొచ్చింది.
సుతిమెత్తని ప్లాస్టిక్‌తో తయారు చేసిన ఈ ‘పట్టీ’ని ధరిస్తే ఇక ఈ ఇబ్బందులన్నీ పోయినట్లే. చొక్కాకు, కాళ్ల సాక్సులను పట్టి ఉంచే ఈ పట్టీకి అవసరానికి తగ్గట్టు సాగే గుణమూ కూడా ఉంది. టక్ చేసినప్పుడు చొక్కా చెదిరిపోకుండా ఉండడమే కాకుండా దీని వల్ల మరో ప్రయోజనం కూడా ఉంది. వదులుగా ఉన్న సాక్సు కిందకు జారకుండా కూడా ఇది పట్టి ఉంచుతుంది. ఇది ధరించిన వారు కారులోకి ఎన్నిసార్లు ఎక్కినా, దిగినా, మెట్లెక్కినా, స్టూలెక్కి ఎత్తున ఉన్న వస్తువులను తీసినా టక్ చెదరదని కంపెనీ వాళ్లు గ్యారెంటీ కూడా ఇస్తున్నారు. ఈ స్ట్రాప్స్ ఒకే సైజులో ఉన్నప్పటికీ దానికున్న సాగే గుణం వల్ల పొడుగువారికి, పొట్టి వారికీ సరిపోతుంది.
ప్రస్తుతం మూడు రంగుల్లో లభిస్తున్న ఈ పట్టీ ధర 1300 రూపాయలు. కంపెనీ వెబ్సైట్ ద్వారా కొనుగోలు చేసే సౌలభ్యం ఉంది.