కామర్స్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్
నల్లగొండ టూటౌన్ : కామర్స్ చదువుతున్న విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ ఉందని జిల్లా ఇంటర్మీడియట్ అధికారి హన్మంతరావు అన్నారు. మంగళవారం స్థానిక లెక్చరర్ భవన్లో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, యాదాద్రి భువనగిరి, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలకు సంబంధించిన జూనియర్ కాలేజీల కామర్స్ అధ్యాపకులకు నిర్వహించిన ఓరియెంటేషన్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఎంజీయూ ప్రొఫెసర్ ఆకుల రవి మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీ పాతనోట్లను రద్దు చేసి కొత్త నోట్లు తీసుకొచ్చారని దీనిపై విద్యార్థుల్లో అవగాహన కల్పించాలని సూచించారు. పాతనోట్లను రద్దు చేసి కొత్తనోట్లు తీసుకొచ్చినందున భవిష్యత్తులో జరిగే లాభాలపై అవగాహన కల్పిస్తే వారిలో చైతన్యం వస్తుందన్నారు. కామర్స్ ప్రాముఖ్యత, ప్రస్తుత ఆర్థిక ఒడిదొడుకులు, తదితర అంశాలపై అధ్యాపకులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాళ్లు మందడి నర్సిరెడ్డి, గట్టుపల్లి అశోక్‌రెడ్డి, ఎర్ర అంజయ్య, ఎంవి. గోనారెడ్డి, టి.లక్ష్మినారాయణ తదితరులున్నారు.