ట్రంప్‌కు మహిళా లాయర్ సీరియస్ వార్నింగ్
న్యూఢిల్లీ: అమెరికా కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన డోనాల్డ్ ట్రంప్‌కు అంతర్జాతీయ హక్కుల ప్రముఖ న్యాయవాది అమల్ క్లూనీ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. అమెరికాకు కొన్ని నైతిక కట్టుబాట్లు ఉన్నాయని, వాటిని ఆయన గౌరవించాలని లేదంటే హక్కుల ఉల్లంఘన కిందకే వస్తుందని చెప్పారు. ట్రంప్ ఎన్నికల ప్రచారంలో అమెరికాయేతరులపట్ల చేసిన విద్వేషపూరిత వ్యాఖ్యలను గుర్తు చేసేలా కొన్ని సంఘటనలు అప్పుడే వెలుగులోకి వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రచారం కోసం ఆయన చేసిన వ్యాఖ్యలను ఆచరణలో చూపడానికి ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదని అన్నారు. అమల్ క్లూనీ హక్కుల న్యాయవాదిగానే కాకుండా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల చెర నుంచి బయటపడిన బాధితులకు కూడా ఆమె అండగా ఉంటారు. అంతేకాదు, వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకు ప్రతినిధిగా ఉన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరిగినా ఆమె స్పందిస్తారు.
గత వారం టెక్సాస్ లో జరిగిన మహిళల సదస్సులో ఆమె మాట్లాడుతూ ట్రంప్ కు ఈ హెచ్చరిక చేశారు. ట్రంప్ ప్రచార సమయంలో అమెరికా మొత్తం మత పరీక్షలు వంటివి నిర్వహించాలన్నారని, ఉగ్రవాదులుగా అనుమానం ఉన్న కుటుంబాలను అంతమొందించాలని వ్యాఖ్యానించారని ఇవన్నీ కూడా అంతర్జాతీయ మానవ హక్కుల ఉల్లంఘన నేరం కిందకు వస్తుందని క్లూనీ చెప్పారు.
ఇప్పటికే ప్రపంచాల్లోని కొన్ని దేశాల్లో అమెరికాలో ఉన్న తమ వాళ్లకు సంబంధించి కొంత ఆందోళన నెలకొందని, దానిని పోగొట్టాల్సిన బాధ్యత ట్రంప్‌కే ఉందని గుర్తు చేశారు. ఇప్పటికే అమెరికా నుంచి కొన్ని హక్కుల ఉల్లంఘనల ఘటనలకు సంబంధించి తనకు ఫోన్లు వస్తున్నాయని నైతిక నిబంధనలు అమెరికా తప్పకుండా పాటించాలని గుర్తు చేశారు. మతపరమైన విద్వేషాలకు తావివ్వకుండా చూడాలని కోరారు.