హైదరాబాదుకు ఆగిన ప్రైవేటు బస్సులు
చిత్తూరు (అర్బన్): ఏపీ నుంచి తెలంగాణ రాష్ట్రానికి వెళ్లే వాహనాలపై అంతర్రాష్ట్ర పన్నులు వసూలు చేయనుండటంతో జిల్లా వ్యాప్తంగా పలు ప్రైవేటు బస్సులను వాటి నిర్వాహకులు నిలిపివేశారు. జిల్లా నుంచి హైదరాబాదుకు వెళ్లే దాదాపు 35 బస్సులు ఒక్కసారిగా ఎక్కడికక్కడ ఆగిపోయాయి. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఏపీ నుంచి తెలంగాణకు వెళ్లే వాహనాలకు మార్చి 31 అర్ధరాత్రి నుంచి పన్నులు వసూలు చేయాలని అక్కడి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. దీని ప్రకారం ఏపీ రిజిస్ట్రేషన్ ఉంటే జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని జిల్లాలకు వెళ్లే బస్సులు పెద్ద మొత్తంలో పన్నులు చెల్లించాల్సి ఉంటుంది.
ఆలిండియా పర్మిట్ ఉన్న బస్సు ఒక సీటుకు రూ.3,675, రాష్ట్ర పర్మిట్ ఉన్న బస్సు ఒక సీటుకు రూ.2,625 చొప్పున తెలంగాణ ప్రభుత్వానికి పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ప్రతి మూడు నెలలకు ఒకసారి పన్నులు తప్పనిసరిగా చెల్లించాలి. దీంతో ప్రైవేటు బస్సుల్ని వాటి నిర్వాహకులు అర్ధాంతరంగా ఆపేశారు. అయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడటానికి ఆర్టీసీ అదనపు సర్వీసుల్ని ఏర్పాటు చేస్తోంది.