భారత్‌కు ఒలింపిక్స్ టిక్కెట్లు లేవు
న్యూఢిల్లీ : ప్రతిష్టాత్మక ఒలింపిక్స్‌ను ప్రత్యక్షంగా తిలకించాలని చాలామందికి ఆశ ఉంటుంది. అయితే భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) నిర్వాకం వల్ల వచ్చే ఏడాది రియో డి జనీరోలో జరిగే ఈ మెగా ఈవెంట్ కోసం ముందుగానే టిక్కెట్లను బుక్ చేసుకునే వీలు లేకుండా పోయింది. ప్రతీ దేశం కూడా కొన్ని టిక్కెట్లను ఆన్లైన్లో అమ్ముకునేందుకు కొంత కోటాను అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ)ని అడుగుతుంది. వీటిని ఐఓసీ టికెటింగ్ భాగస్వామి లేక తాము సొంతంగానే అమ్మకానికి ఉంచుతారు.
అయితే టిక్కెట్ల కోసం ఎన్నిసార్లు తుది గడువు ఇచ్చినా ఐఓఏ నుంచి స్పందన లేకపోవడంతో భారత్‌కు టిక్కెట్లు రాకుండాపోయాయి. లండన్ ఒలింపిక్స్‌లో ఎప్పుడూ లేనిది భారత్‌కు ఆరు పతకాలు వచ్చాయి. ఈసారి గేమ్స్‌కు భారత్ నుంచి ఉండే ఆదరణను ఐఓఏ సొమ్ము చేసుకోలేకపోయింది. దీంతో భారత ఒలింపిక్ సంఘం ఏమాత్రం సమష్టిగా పనిచేయడం లేదనే విషయం బయటపడింది.