క్రికెట్ బెట్టింగ్ కేసులో సీబీఐ భారీ దాడులు
ఢిల్లీ: ఐపీఎల్- 8 బెట్టింగ్ కేసును విచారిస్తున్న సీబీఐ పలు నగరాల్లో భారీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా ముగ్గురు మధ్యవర్తులను అధికారులు అరెస్ట్ చేశారు. నిందితులనుంచి ఈడీ ఉన్నతాధికారులు లంచం డిమాండ్ చేశారనే అరోపణలపై విచారణ చేపట్టిన సీబీఐ వీరిని అరెస్ట్ చేసింది. సోనూ జలన్, జయేష్ థక్కర్,జేరే అరోరా లను సీబీఐ అరెస్ట్ చేసింది.
ముంబై నుంచి సోనూ, అహ్మదాబాద్ నుంచి జయేష్ థక్కర్, డిల్లీనుంచి జేకే అరోరాలను అదుపులోకి తీసుకుంది. ఈ సందర్భంగా ఢిల్లీ, ముంబై, జైపూర్ నగరాలలోని నిందితుల ఇళ్లపై దాడులు చేసిన అధికారులు కోటికి పైగా నగదును అనేక నేరారోపణ పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం వీరిని గుజరాత్ కోర్టు ముందు ప్రవేశపెట్టిన అనంతరం రిమాండ్ కు తరలించారు.
2015 మేలో ఢిల్లీ, జైపూర్, బెంగళూరు, ముంబై సహా పలు నగరాల్లో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారుల దాడుల సందర్భంగా ఐపీఎల్- 8 బెట్టింగ్ వ్యవహారం వెలుగు చూసింది. ఈ కేసులో అయిదుగురు బుకీలను అరెస్ట్ చేశారు. ఈ సంద్భంగా ఈడీ అధికారులపై అవినీతి, లంచం ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో అహ్మదాబాద్ ఈడీ జాయింట్ డైరెక్టర్ జేపీ సింగ్, ఇతర అధికారులపై దర్యాప్తు చేయాల్సిందిగా ఈడీ ..సీబీఐని కోరింది. దీంతో సుమారు ఐదు నెలల తరువాత, సెప్టెంబర్ 2015 లో జేపీ సింగ్, ఇతర ఈడీ అధికారులపై సీబీఐ కేసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే.