'నిజమే.. స్మగ్లింగ్ టర్కీ నుంచే జరుగుతుంది'
బాగ్దాద్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ పెద్ద మొత్తంలో ఆయిల్ ను టర్కీ నుంచే దొంగ రవాణా చేస్తుందని ఇరాక్ ప్రధాని హైదర్ అల్ అబాది అన్నారు. దీనిని ఎలాగైనా ఆపాలని, వారిని నియంత్రించేందుకు ఇది దోహదపడుతుందని ఆయన చెప్పారు. ఇటీవల రష్యా యుద్ధ విమానాన్ని టర్కీ కూల్చి వేసిన అనంతరం టర్కీ ప్రధాన వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. ఇస్లామిక్ స్టేట్ కు సహకరించాలనే ఉద్దేశంతోనే సిరియా సరిహద్దుల్లో ఉన్న తమ విమానాన్ని కూల్చివేశారని రష్యా టర్కీపై ఆరోపణలు చేయగా మరో అగ్రరాజ్యం ఆ మాటలను పరోక్షంగా కొట్టి వేసింది.
ఇస్లామిక్ స్టేట్ కు టర్కీకి సంబంధాలు ఉన్నట్లు తమ పరిశీలనలో వెల్లడికాలేదని, ఆధారాలు కూడా లభ్యంకాలేదని చెప్పింది. ఈ వ్యాఖ్యలు రష్యాకు ఆగ్రహం తెప్పించగా రష్యాకు మద్దతుగా తాజాగా టర్కీపై ఇరాక్ ఆరోపణలు చేసింది. బాగ్దాద్ పర్యటనకు జర్మన్ కు చెందిన విదేశాంగ మంత్రి ఫ్రాంక్ వాల్టర్ స్టెయిన్ మీర్ వచ్చిన నేపథ్యంలో ఆయనతో సమావేశమైన అబాది ఈ వ్యాఖ్యలు చేశారు. ఇస్లామిక్ స్టేట్ కు భారీ మొత్తంలో ఆయిల్ స్మగ్లింగ్ టర్కీ ద్వారానే జరుగుతుందని, దానిని నిలువరించగలిగితే కొంత సమస్య తీరినట్లేనని చెప్పారు.