కడప ఉక్కుపై కుంటి సాకులు
కడప సెవెన్‌రోడ్స్:
కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదంటూ కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం దారుణమని ఎమ్మెల్సీ డాక్టర్ గేయానంద్ అన్నారు. సోమవారం స్టేట్ గెస్ట్‌హౌస్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. లోక్‌సభలో ఓ సభ్యుడు అడిగిన ప్రశ్నకు కేంద్రం పైవిధంగా ప్రకటన చేయడం సరికాదన్నారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు చేయడం ఆర్థికంగా లాభదాయకం కాదని, ముడిఖనిజం కూడా లభ్యం కాదనడం కుంటిసాకులేనన్నారు. ఇది విభజన హామిని అమలు చేయబోమంటూ ప్రకటించడమేనన్నారు. విశాఖ స్టీల్‌కు ఉత్తర భారతం దేశం నుంచి ముడిఖనిజం సరఫరా అవుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పది రోజుల్లో సెయిల్, ఎన్ఎండీసీ, బీఐఎన్‌ఎల్ అధికారులతో కూడిన టాస్క్‌ఫోర్స్ సమావేశాన్ని ఏర్పాటు చేస్తామంటూ ఓవైపు చెబుతూనే, కడప స్టీల్ ప్లాంటు సాధ్యం కాదని ముందే ఎలా ప్రకటిస్తారంటూ ఆయన ప్రశ్నించారు. ప్రధానమంత్రి తన వద్ద ఉన్న నివేదికపై స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు.
కడపలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు వీలు కాదంటూ చేసిన ప్రకటనను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్‌చేశారు. కేంద్రం అంగీకరించకపోతే రాష్ట్ర ప్రభుత్వమే రూ. 10 వేల కోట్లతో కడపలో ప్లాంటు ఏర్పాటు చేయాలన్నారు. ఇక్కడి ఫ్యాక్షనిజం కారణంగా పరిశ్రమలు రావడం లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పడం అర్థరహితమన్నారు. స్టీల్ ప్లాంటు అంశంపై రానున్న శాసనమండలి సమావేశాలను స్తంభింపజేస్తామని హెచ్చరించారు. రాయలసీమ అభివృద్ది వేదిక నాయకుడు ఎ.రఘునాథరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం చట్టంలో లేదని మాట్లాడుతున్న కేంద్ర ప్రభుత్వం, విభజన చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంటును ఎందుకు ఏర్పాటు చేయడం లేదో చెప్పాలని నిలదీశారు. ఈ సమావేశంలో రాయలసీమ అభివృద్ది వేదిక నాయకులు పి.మహమ్మద్ అలీఖాన్, లక్ష్మిరాజా, రాజశేఖర్ రాహుల్, కె.శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు.