మొబైల్ బుక్ చేస్తే.. ఐరన్ లాకెట్ వచ్చింది
గుత్తి: మంచి ఆఫర్ వచ్చిందని సంబరపడ్డాడు. వెంటనే ఆన్లైన్లో సెల్‌ఫోన్ బుక్ చేశాడు. తీరా పోస్టులో సెల్‌ఫోన్‌కు బదులు ఐరన్ లాకెట్ రావడంతో అవాక్కయ్యాడు. అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని జెండావీధికి చెందిన మహ్మద్ హుసేన్ అలియాస్ డాన్స్ గోరాకు ఈనెల 23న ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో తాము ఢిల్లీ ప్రథమరత్న ఆస్ట్రాలాజికల్ కంపెనీ నుంచి మాట్లాడుతున్నామని సామ్సంగ్ గ్రాండ్ మొబైల్ భారీ ఆఫర్ ఉందన్నారు. మొబైల్ అసలు రేటు రూ.8,400 అని అయితే ఆఫర్ డిస్కౌంట్ పోను కేవలం రూ.3,000కే ఇస్తామని చెప్పారు.
ఇప్పుడే డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదని పోస్టులో వచ్చాక పోస్టల్ అధికారులకే బిల్లు (డబ్బు) చెల్లించాలని చెప్పా రు. ఆశపడిన గోరా క్షణం కూడా ఆలోచించకుండా మొబైల్‌ను బుక్ చేశాడు. సోమవారం పోస్టల్ అధికారులు మీకు పార్సిల్ వచ్చిందని తీసుకెళ్లాలని గోరాకు ఫోన్ చేశారు. గోరా పోస్టాఫీసులో రూ.3 వేలు చెల్లించి పార్సిల్ బాక్స్‌ను తీసుకున్నాడు. అక్కడే బాక్స్‌ను ఓపెన్ చేసి చూడగా ఐరన్ లాకెట్ ఉంది. ఒక్క సారిగా తెల్లమొఖం వేసిన గోరా తనకు వచ్చిన సెల్‌ఫోన్ నంబర్‌కు ఫోన్ చేయగా స్విచ్చాఫ్‌లో ఉంది.