ఉమా.. హరీశ్ రావు భేటీ!
తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదం నేపథ్యంలో ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ మంత్రులు హరీశ్ రావు, దేవినేని ఉమామహేశ్వరరావు ఢిల్లీలో భేటీ అయ్యారు. కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి అమర్ జిత్ సింగ్ సమక్షంలో ఈ సమావేశం కొద్దిసేపటి క్రితం ప్రారంభమైంది. కృష్ణాజలాల వినియోగంపై రెండు రాష్ట్రాలు మెట్టు దిగకపోవడంతో ఈ అంశంపై ప్రతిష్టంభన ఏర్పడింది. దాంతో కేంద్రం జోక్యం చేసుకుని ఇద్దరినీ పిలిపించింది. నిన్న జరిగిన సమావేశంలో ఏకాభిప్రాయం రాకపోగా పరస్పరం నిందించుకున్నారు. దాంతో మళ్లీ గురువారం ఉదయం ఇద్దరు మంత్రులతో అమర్ జిత్ సింగ్ సమక్షంలో సమావేశం ప్రారంభమైంది.
నీటి వినియోగం విషయంలో విభజన చట్టాన్ని అమలుచేయాలని ఏపీ అడుగుతోంది. అయితే ఈ విషయంలో ఇప్పటికీ ఫైనల్ అవార్డు రాని నేపథ్యంలో పరిధిని ఎలా నిర్ణయిస్తారని తెలంగాణ ప్రశ్నిస్తోంది. ఇద్దరినీ ఒకే తాటిపైకి తేవడం కేంద్రానికి తలకు మించిన భారంగా మారుతోంది. రెండు రోజుల పాటు జరిగిన సమావేశాలలో తుది ఒప్పందం కుదిరేవరకు గతంలో కుదిరిన ఒప్పందాల మేరకే నీటి నిర్వహణ, వినియోగం కొనసాగాలని, యథాతథ స్థితి కొనసాగించాలని అన్నారు. దీనిపై తుది నిర్ణయం తీసుకునే దిశగా రెండు రాష్ట్రాలకు చెందిన మంత్రులను పిలిపించి సమావేశం ఏర్పాటుచేశారు.