'ఐఎస్ఐతో కాంగ్రెస్ పార్టీకి లింకులు'!
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ దేశద్రోహ సంస్థగా వ్యవహరిస్తున్నదని, ఆ పార్టీకి పాకిస్థాన్ గూఢచర్య సంస్థ ఐఎస్ఐతో సంబంధాలు ఉన్నాయని పంజాబ్ ఉప ముఖ్యమంత్రి, అకాలీ దళ్ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్ తీవ్ర ఆరోపణలు చేశారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే ఉగ్రవాదులతో పొత్తు పెట్టుకున్న చరిత్ర ఆ పార్టీకి ధ్వజమెత్తారు. '1980లలో పంజాబ్‌లో ఏం జరిగిందో ప్రతి ఒక్కరికీ తెలుసు. దాదాపు 15 ఏళ్లు మిలిటెన్సీ ప్రబలి తీవ్ర అశాంతి, అలజడి చెలరేగింది. వందలమంది పంజాబీలు చనిపోయారు. మతఘర్షణలు చోటుచేసుకున్నాయి. పంజాబ్ అల్లకల్లోలం అయింది' అని ఆయన శనివారం విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు.
'ఈ అలజడి ఎలా ప్రారంభమైందో అందరికీ తెలిసిందే. అకాలీ దళ్‌ను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కొన్ని శక్తులను ప్రోత్సహించింది. ఆ శక్తులు అదుపుతప్పి పంజాబ్‌లో 15 ఏళ్ల పాటు అశాంతిని సృష్టించాయి. దేశ సమగ్రతకు భంగం వాటిల్లింది. పంజాబ్‌లో ఆనాటి అశాంతి వాతావరణాన్ని మరోసారి సృష్టించడానికి ఈ రోజు రాహుల్‌గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తున్నది' అని ఆయన ఆరోపించారు. ఐఎస్ఐతో సంబంధాలున్న ఉగ్రవాద సంస్థలతో కూడా కాంగ్రెస్ పార్టీ పొత్తు పెట్టుకొని రాజకీయ ప్రయోజనాల కోసం పాకులాడిందని, ఆ పార్టీ ప్రస్తుతం తన అసలు రంగు బయటపెడుతూ.. దేశద్రోహ సంస్థగా వ్యవహరిస్తుందని సుఖ్బీర్ తీవ్రంగా ధ్వజమెత్తారు.