‘బియ్యం సరఫరా లేదు.. భోజనం పెట్టలేం’
ఇస్కాన్ మందిర నగర అధ్యక్షుడు సత్య గోపీనాథ్
రాజమండ్రి సిటీ : ఇస్కాన్ ఫుడ్ రిలీప్ ఫండ్‌కు ఇవ్వాల్సిన బియ్యం సరఫరాను రెవెన్యూ అధికారులు నిలిపివేయడంతో శనివారం నుంచి ఇస్కాన్ మందిరంలో మధ్యాహ్న భోజన పథకాన్ని నిలిపివేస్తున్నట్టు ఇస్కాన్ మందిరం రాజమండ్రి శాఖ అధ్యక్షుడు సత్యగోపీనాథ్ శుక్రవారం వెల్లడించారు. ఇస్కాన్ మందిరంలో ఆయన మాట్లాడుతూ తమకు అందాల్సిన 200 క్వింటాళ్ల బియ్యం నిలిచిపోయాయని, అందువల్ల భోజనం సరఫరా నిలిపివేస్తున్నట్టు తెలిపారు. 2012 సంవత్సరానికి సంబంధించి ప్రతి పాఠశాలకు నెలకు రూ.వెయ్యి చొప్పున పనివారికి ఇచ్చేందుకు నెలకు రూ.58 వేల చొప్పున రిలీజ్ అయ్యాయని, వాటినిజిల్లా విద్యాశాఖ కార్యాలయ ఉద్యోగులు స్వాహా చేసి ఉంటారని ఆయన ఆరోపించారు. ఇస్కాన్‌కు మధ్యాహ్న భోజన పథక పునరుద్ధరణ విషయమై నగర కమిషనర్ రవీంద్రబాబును వివరణ కోరగా విద్యాశాఖ నుంచి వినతులు అందలేదన్నారు.