భారత్‌లో ఐఎస్ఐఎస్ ముప్పు!
న్యూఢిల్లీ: ఐఎస్ఐఎస్ ఉగ్రవాద సంస్థపై ఫ్రాన్స్ ప్రకటించిన యుద్ధానికి భారత్ సంపూర్ణ మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఆ ఉగ్రవాద సంస్థ నుంచి దేశానికి మరింత ముప్పు పొంచి ఉందని భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ స్థాయి నగరంలోనే అసాధారణస్థాయి దాడులతో ఇస్లామిక్ స్టేట్ విరుచుకుపడిన నేపథ్యంలో దాని నుంచి పొంచి ఉన్న ముప్పును మరోసారి సమీక్షించాలని భారత భద్రతా సంస్థలు భావిస్తున్నాయి. పారిస్ దాడుల అనంతరం ఐఎస్ఐఎస్ నుంచి పొంచి ముప్పును హైలెవల్‌గా భావిస్తున్నామని, అదేవిధంగా దేశంలో దాని కార్యకలాపాలను నిరోధించేందుకు కౌంటర్ వ్యూహాన్ని తీసుకురావావాలని అనుకుంటున్నామని నిఘా వర్గాలు తెలిపాయి.
యూరప్‌లోనే అత్యంత కీలకమైన నగరం, అత్యంత భద్రత ఉండే ప్రదేశమైన పారిస్‌లోనే భారీ దాడులు నిర్వహించడంతో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ బలం, ఆత్మవిశ్వాసం పుంజుకునే అవకాశముందని, ఈ నేపథ్యంలో సహజంగానే మరిన్ని భారీ దాడులకు పాల్పడేందుకు అది ప్రయత్నిస్తుందని సీనియర్ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు తెలిపారు. ఏ నగరాన్నైనా ఐఎస్ఐఎస్ ఇప్పుడు లక్ష్యంగా చేసుకోగలదని, ఈ నేపథ్యంలో ముందుగానే ఈ ముప్పు గుర్తించి దానికి అనుగుణమైన భద్రతా వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్టు ఆయన తెలిపారు.
ఐఎస్ఐఎస్ను ఎదుర్కోవడంలో ఫ్రాన్స్‌కు పూర్తి సహకారమందిస్తామని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిరెన్ రిజిజు సోమవారం ఢిల్లీలోని ఫ్రాన్స్ రాయబార కార్యాలయంలో మాట్లాడుతూ చెప్పారు. అయితే ఐఎస్ఐఎస్పై పోరులో ఫ్రాన్స్‌కు భారత్ ఏ తరహా సాయం అందిస్తుందనే దానిపై ఇంకా ఒక స్పష్టత రాలేదని అధికార వర్గాలు తెలిపాయి.