ఏపీని ఆటోమొబైల్ హబ్ గా చేస్తా..
♦ ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య
♦ సిటీలో ఇసుజు ప్లాంటు ప్రారంభం
సాక్షి, సత్యవేడు: రాష్ట్రాన్ని ఆటోమొబైల్ హబ్‌గా అభివృద్ధి చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. శ్రీ సిటీలో ఏర్పాటైన ‘ఇసుజు’ తయారీ పరిశ్రమను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వి-క్రాస్ అడ్వెంచర్ యుటిలిటీ వాహనాన్ని నడిపి చూశారు. అనంతరం సీఎం మాట్లాడుతూ ప్రపంచస్థాయి వసతులున్న శ్రీ సిటీకి దేశంలో మరే సెజ్ సాటి రాదన్నారు. ‘‘ఏపీలో పరిశ్రమల స్థాపనకు అపార అవకాశాలున్నాయి. శ్రీ సిటీ ప్రాంతాన్ని ఆటో మొబైల్ హబ్‌గా తీర్చి దిద్దుతాం. శ్రీ సిటీకి మరిన్ని పరిశ్రమలు వచ్చేలా చూస్తాం’’ అన్నారాయన.
శ్రీ సిటీలో జపాన్‌కు చెందిన 18 పరిశ్రమలు ఏర్పడటాన్ని ప్రస్తావిస్తూ... జపాన్‌తో రాష్ట్రానికి విడదీయరాని అనుబంధం ఉందని, వ్యవసాయ అభివృద్ధికి జపాన్‌తో కలసి పనిచేస్తామని చెప్పారు. అమరావతి నిర్మాణంలో జపాన్ భాగస్వామ్యం ఉందన్నారు. ఆరు నెలల క్రితం జపాన్ పర్యటనలో రాష్ట్ర పరిస్థితులపై అక్కడి పారిశ్రామికవేత్తలతో చర్చించినట్లు సీఎం తెలిపారు. ఇసుజు మోటార్స్ ప్రెసిడెంట్ మసనోరి కతయమ మాట్లాడుతూ ప్రపంచంలో అతిపెద్ద ఆటోమొబైల్ మార్కెట్లలో భారత్ ఒకటన్నారు. ఇసుజు మోటార్స్ అంతర్జాతీయ ప్రయాణంలో ఇండియా అత్యంత కీలకమైన భాగమని చెప్పారు.
‘‘మున్ముందు ఇసుజు గ్లోబల్ ఆపరేషన్స్‌కు భారత్ అత్యంత కీలకంగా మారుతుంది’’ అన్నారాయన. ఇసుజు మోటార్స్ ఇండియా చైర్మన్ హిరోయాసుమియరాతో పాటు కార్యక్రమంలో భారత్‌లోని జపాన్ రాయబారి కెన్టీ హీరా, శ్రీ సిటీ చైర్మన్ శ్రీనిరాజు, ఎండీ రవీంద్రసన్నారెడ్డి, డిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధి కంభంపాటి రామమోహనరావు, రాష్ట్ర మంత్రులు గోపాల కృష్ణారెడ్డి, నారాయణ, స్థానిక ఎమ్మెల్యే ఆదిత్య తదితరులు పాల్గొన్నారు