22 అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటో బంద్
రవాణా కమిషనర్‌కు సమ్మె నోటీస్ ఇచ్చిన ఆటో సంఘాల జేఏసీ
సాక్షి, హైదరాబాద్: ఆటోలపై పోలీసులు, ఆర్టీఏ చేపట్టిన స్పెషల్ డ్రైవ్‌కు నిరసనగా ఆటో సంఘాల జేఏసీ ఈ నెల 22 అర్ధరాత్రి నుంచి నిరవధిక ఆటోబంద్‌కు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, సీఐటీయూ, బీఎంఎస్, ఐఎన్టీయూసీ, టీఆర్‌ఎస్‌టీవీ, టీఏడీయూ తదితర సంఘాల జేఏసీ ప్రతినిధుల బృందం గురువారం రవాణా కమిషనర్ సందీప్‌కుమార్ సుల్తానియాకు సమ్మె నోటీసు అందజేసింది.
మీటర్లు లేకుండా తిరగడం, మీటర్ల ట్యాంపరింగ్‌కు పాల్పడటం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వంటివి నియంత్రించేందుకు ఈ నెల 16 నుంచి ఆర్టీఏ, పోలీసులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టిన విషయం తెలిసిందే. ఈ స్పెషల్ డ్రైవ్‌పై వివిధ రూపాల్లో ఆందోళనలు చేపట్టిన ఆటో సంఘాలు తాజాగా ఆటోల బంద్‌కు సన్నద్ధమయ్యాయి. మీటర్ ట్యాంపరింగ్ వంటి వాటికి పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఆ వంకతో పోలీసులు, ఆర్టీఏ, తూనికలు, కొలతలు శాఖ అధికారులు తమపై మూకుమ్మడిగా వేధింపులకు పాల్పడుతున్నారని జేఏసీ నాయకులు, ఏఐటీయూసీ అనుబంధ ఆటో సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకటేష్ చెప్పారు. మీటర్ సీళ్లు లేవని, డాక్యుమెంట్స్ లేవనే సాకుతో రూ.5,000 నుంచి రూ.15,000 వరకు జరిమానాలు విధిస్తున్నారన్నారని, దీంతో ఆటో డ్రైవర్ల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి నెలకొందన్నారు.
అలాగే... గ్రేటర్ హైదరాబాద్‌లో ఆటోరిక్షాలకు ప్రధాన పోటీగా నిలిచిన ఓలా, ఉబెర్ క్యాబ్‌లను వెంటనే రద్దు చేయాలని జేఏసీ డిమాండ్ చేసింది. వీటితోపాటు 50 ఏళ్లు నిండిన ఆటోడ్రైవర్లకు పెన్షన్లు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇవ్వాలనే తదితర డిమాండ్లతో సమ్మె నోటీసు అందించింది.