తోలుమందం సర్కార్
ఉద్దానంలో చంద్రబాబు ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన ప్రతిపక్ష నేత వైఎస్ జగన్
కిడ్నీవ్యాధి బాధితులకు అండగా ఉంటాం
- అధికారంలోకి వచ్చిన వెంటనే నెలనెలా రూ.10 వేల పింఛన్
- వ్యాధిగ్రస్తుల కేంద్రీకృత ప్రాంతాల్లో డయాలసిస్ యూనిట్లు
- ఆరోగ్యశ్రీ పథకాన్ని వైఎస్ నాటి దశను దాటి అమలు చేస్తాం
- జగతి గ్రామంలో బాధితులతో ప్రతిపక్ష నేత ముఖాముఖి
సాక్షి ప్రతినిధి శ్రీకాకుళం: ‘‘ఉద్దానంలోని ఏడు మండలాల్లో లక్ష మందికి రక్తపరీక్షలు నిర్వహిస్తే దాదాపు 35 వేల మందికి కిడ్నీ వ్యాధి ఉన్నట్లు వెల్లడైంది. గత మూడునాలుగేళ్లలో మూడు వేల మంది వరకు ఈ వ్యాధితో చనిపోయారు. ఇంత దారుణ పరిస్థితులు ఇక్కడ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇది తోలుమందం సర్కార్.. సీఎం చంద్రబాబుకు బుద్ధీ జ్ఞానం ఉంటే ఈ కార్యక్రమం చూసైనా మారతారనుకుంటున్నా.’’ అని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. శ్రీకాకుళం జిల్లాలో రెండో రోజు పర్యటనలో భాగంగా కవిటి మండలం జగతి గ్రామంలో శనివారం నిర్వహించిన కిడ్నీవ్యాధి బాధితులతో ముఖాముఖిలో జగన్ పాల్గొన్నారు. వారితో దాదాపు రెండు గంటల సేపు మాట్లాడారు. వారి కష్టాలు తెలుసుకున్నారు. బాధితులతో ముఖాముఖి కార్యక్రమంలో జగన్ స్పందన ఆయన మాటల్లోనే....
కిడ్నీ వ్యాధిగ్రస్తులకు నెలకు రూ. 10వేల పింఛన్
మన ఆందోళనలు, బాధితుల ఆక్రందనలు చంద్రబాబులో మార్పు తీసుకురాలేకపోతే నేను అందరికీ ఒకటే భరోసా ఇస్తున్నా. మరో ఏడాది ఏడాదిన్నర తరువాత వచ్చేది మన ప్రభుత్వమే. ఆరోగ్యశ్రీ పథకం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్వప్నం. ఆ పథకాన్ని ఆయన ఒక దశకు తీసుకెళితే రెండో దశకు తీసుకెళ్లడానికి ప్రయత్నం చేస్తానని హామీ ఇస్తున్నా. కిడ్నీ వ్యాధిగ్రస్తులకు ప్రతినెలా రూ. 10 వేల రూపాయల పింఛను ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఏ పేదవాడు కూడా మందుల కోసం ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం రానివ్వం. ఇంట్లో మిగిలిన వాళ్లు ఇబ్బంది పడే పరిస్థితి రానివ్వం. రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా కిడ్నీ పేషెంట్లు ఎక్కువగా కేంద్రీకృతమై ఉంటే స్థానిక పీహెచ్‌సీల్లోనే డయాలసిస్ యూనిట్లు ఏర్పాటు చేయిస్తాం
ఇది దారుణమైన పాలన..
చంద్రబాబు పరిపాలన ఎంత దారుణంగా జరుగుతుందంటే ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల అవస్థలే నిదర్శనం. ఆరోగ్య శ్రీ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేశారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ రాజశేఖరరెడ్డి మహోన్నత ఉద్దేశంతో 2007లో ప్రవేశపెట్టిన ఈ పథకం కొన్ని లక్షల మంది ప్రాణాలను నిలబెట్టింది. అలాంటి పథకాన్ని మరింత మెరుగు పరచి ప్రజల ఆరోగ్యానికి రక్షణ కల్పించాల్సింది పోయి చంద్రబాబు నీరుగార్చేస్తున్నారు. మొన్న ఒంగోలులో ధర్నా చేశాం. కనిగిరిలో కిడ్నీ పేషెంట్లను చూపించాం. జగతి గ్రామంలో మళ్లీ ఈ వేళ కిడ్నీ వ్యాధిగ్రస్తులు పడుతున్న అవస్థలు, ఇబ్బందులను చూపెడుతున్నాం. కానీ ఆరోగ్యశ్రీని ఎంత దారుణంగా నడిపిస్తున్నారంటే ఈసారి బడ్జెట్లో కేవలం రూ.1,000 కోట్లు మాత్రమే చంద్రబాబు కేటాయించారు. దీనిలో రూ.485 కోట్లు గత ఏడాది బకాయిలు. ఇవాళ ఆరోగ్యశ్రీ పేషెంట్ ఎవరైనా ఆసుపత్రికి వెళితే డాక్టర్లు వైద్యం చేయని పరిస్థితి. రేపు రా మాపు రా అని చెబుతున్న స్థితి. దీనికి కారణం ఏమిటంటే ప్రభుత్వం ఏడెనిమిది నెలలుగా బిల్లులు చెల్లించడం లేదు.
పిల్లల ఆపరేషన్ ఖర్చు మిగుల్చుకుంటారా?
కిడ్నీ పేషెంట్లకు గానీ, కాక్లియర్ ఇంప్లాంట్ పేషెంట్లకు గానీ వైద్యం అందే పరిస్థితిలేదు. కాక్లియర్ ఇంప్లాంట్ ఆపరేషన్లంటే మీ అందరికీ తెలుసు. మూగ, చెవుడు ఉన్న పిల్లలకు ఆపరేషన్లు చేసి వైకల్యం తొలగించి ఆరోగ్యం ప్రసాదించడం కాక్లియర్ ఇంప్లాంట్. ఆ ఆపరేషన్ చెయ్యాలంటే దాదాపుగా రూ.6 లక్షలకు పైన అవుతుంది. 12 ఏళ్లలోపు పిల్లలందరికీ దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ హయాంలో ఉచితంగా కాక్లియర్ ఆపరేషన్లు జరిగేవి. ఇవాళ ఆరోగ్యశ్రీ ఆపరేషన్లను ఎలా కత్తిరించాలా అని ఆలోచిస్తున్నారు. ఇవాళ మూగ చెవుడు పిల్లలకు ఆపరేషన్లు చేయించాలంటే ఆ పిల్లలకు రెండేళ్ల వయసు లోపే ఉండాలట. రెండేళ్లలోపు పిల్లలకు మూగ, చెవుడు లోపాలున్నాయని తల్లి ఎలా గుర్తించగలుగుతుంది? ఒకో పిల్లాడికి ఆరు లక్షల రూపాయల ఖర్చు అవుతుంది కాబట్టి ఆ ఖర్చు తగ్గించుకోవాలని ఈ ప్రభుత్వం దిక్కుమాలిన ఆలోచన చేస్తోంది.
108 వాహనాల డీజిల్‌కూ డబ్బివ్వడంలేదు..
ఒకప్పుడు 108 నంబర్‌కు ఫోన్ చేస్తే 20 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చి ఆపదలో ఉన్న వ్యక్తిని పెద్దాసుపత్రిలో చేర్పించేది. అక్కడ కూడా ఉచితంగా వైద్యం అందడంతో చిరునవ్వుతో ఆ వ్యక్తి ఇంటికి వెళ్లే పరిస్థితి ఉండేది. ఇవాళ 108కి ఫోన్ చేస్తే అందులో పనిచేసే సిబ్బందికి రెండుమూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదనే ఆవేదన వినిపిస్తోంది. డీజిల్ బకాయిలు చెల్లించలేదు కాబట్టి తాము 108 వాహనాలకు డీజిల్ ఇవ్వడం లేదని పెట్రోల్‌బంకుల యజమానుల నుంచి వాదనలు వినిపిస్తున్నాయి. ఈ కారణంతోనే విజయనగరం జిల్లాలో రెండు రోజులు పాటు 108 వాహనాలు నిలిచిపోయిన పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తుంది.
104 వాహనాలు ఎక్కడున్నాయో?
రోగులకు మందులిచ్చేందుకు 104 వాహనాలతో ఆదుకోవలసిన ప్రభుత్వం ఆ బాధ్యత వదిలేసింది. కిడ్నీ పేషెంట్లు మందుల దశ దాటి డయాలసిస్ దశకు చేరుకుంటున్నారు. డయాలసిస్ దశ నుంచి ఆ తర్వాత కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ దశకు ఆరోగ్యం దిగజారుతోంది. ప్రతి గ్రామానికి వెళ్లి నడవలేని పరిస్థితిలో ఉన్న రోగులకు, వృద్ధులకు, బీపీ, షుగర్ రోగులకు మందులిచ్చి, కిడ్నీ రోగులకు మందులు ఇవ్వాల్సిన ప్రభుత్వం 104ను పూర్తిగా వదిలేసిన పరిస్థితి. ఇవాళ 104కు ఫోన్ చేస్తే ఆ వాహనాలు ఎక్కడ ఉన్నాయో కనుక్కోలేకపోతున్నారు.
కిడ్నీ పేషెంట్లపై కనికరం లేని ప్రభుత్వం
సాధారణంగా రక్తపరీక్షలలో సీరం క్రియాటిన్ లెవెల్స్ 1.4 దాటితే ప్రమాదకర దశ అని అర్థం. ఆ దశకు చేరకుండా నియంత్రించడానికి మందులు, ఇంజక్షన్లు తీసుకోవాలి. ఈ దశ దాటి డయాలసిస్ దశకు వెళితే డయాలసిస్‌కు, మందులకు, ఆసుపత్రికి రానుపోను ఖర్చులు కలిపి నెలకు రూ.20వేల నుంచి రూ.25 వేలు వరకు అవుతుంది. ఇక డయాలసిస్ దశ దాటితే చివరి మార్గం కిడ్నీ మార్పిడి ప్రక్రియ ఒక్కటే. ఈ ఆపరేషన్‌కు అయ్యే ఖర్చు దాదాపు రూ.10 లక్షలు. ఈ ఆపరేషన్ చేయించుకున్నా ఆ తరువాత మందులకు మళ్లీ ప్రతినెలా ఖర్చు తప్పదు. ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పేషెంట్లు ఉన్నప్పుడు మనం చేస్తున్న నిరసనలు, ధర్నా కార్యక్రమాల ద్వారా నైనా ఈ ప్రభుత్వంలో మార్పు వస్తుందని ఆశిస్తాం. తాము పడుతున్న కష్టాలు, బాధలు పేషెంట్ల నోటి ద్వారా విన్న తరువాతైనా చంద్రబాబుకు జ్ఞానోదయం అవుతుందని, ఆయనలో కదలిక వస్తుందని ఆశ. ఒంగోలులోను, కనిగిరిలోను ఇదే ప్రయత్నం చేసినా ఆయన చర్మం చాలా మందం. కనీసం ఉద్దానం కిడ్నీ రోగుల ఆవేదన విన్నాౖకైనా ఆయనలో మార్పు రావాలి. మనం ఆశించినంత వేగంగా మార్పు రాకపోయినా ఒత్తిడి అయితే మాత్రం తీసుకురాగలం.
కేంద్రం సంసిద్ధంగా ఉన్నా కనీసం ప్రతిపాదన పంపరా?
ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధులు దారుణమైన పరిస్థితిలో ఉంటే కనీసం ఇక్కడ పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలన్న ఆలోచనే రాష్ట్ర ప్రభుత్వానికి లేకపోవడం దురదృష్టకరం. ఈ వ్యాధులకు కారణాలేంటి, నిరోధానికి ఏమి చర్యలు తీసుకోవాలి అనే విషయాలు తెలుసుకునేందుకు ఈ పాటికే ఇక్కడ కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేసి ఉండాల్సింది. మూడేళ్ల పాలన గడిచిపోయినా చంద్రబాబుకు ఆ ఆలోచనే రాకపోవడం దురదృష్టకరం. రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం సంసిద్ధత వ్యక్తం చేసినా కనీసం రాష్ట్రం నుంచి ప్రతిపాదన కూడా పంపకపోవడం దారుణం. ఈ విషయం కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఇటీవల పార్లమెంటు సమావేశాల్లో ప్రశ్నించినప్పుడు వెలుగులోకి వచ్చింది. సాగునీరు, తాగునీరులోని సిలికాన్ తదితర కొన్ని మూలకాలు కిడ్నీ వ్యాధికి కారణమనే వాదన ఉన్నప్పుడు ప్రభుత్వం కనీసం తగిన చర్యలు తీసుకోవాలి కదా? ఆ విషయంలో రాష్ట్రప్రభుత్వం దారుణంగా విఫలమైంది. జిల్లాలోని నదులలో నీటిని ఒడిసిపట్టి ఉద్దాన ప్రాంతానికి మళ్లించి భూగర్భ జలాల్లో మార్పు తీసుకురావాలి. ఇదే కాకుండా ఇతర కారణాలు అన్వేషించేందుకు ఉద్దానంలో కిడ్నీ వ్యాధుల పరిశోధన కేంద్రం ఏర్పాటు చేయాలి’’ అని జగన్మోహన్రెడ్డి పేర్కొన్నారు.