సెల్‌ఫొన్‌లో చెబితే.. ఆపరేషన్ చేశారు
జగిత్యాల క్రైం/జగిత్యాల: జగిత్యాల జిల్లా ఆస్పత్రి ఓ వైద్యురాలు డ్యూటీకి రాకుండా ఫోన్లో సూచనలిస్తూ నర్సులతో ఆపరేషన్ చేయించింది. దీంతో పుట్టిన బిడ్డ మృత్యువాత పడగా.. విషయం బయటకు పొక్కకుండా వైద్యులు శతవిధాలా ప్రయత్నం చేశారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని విద్యానగర్‌కు చెందిన గర్భిణి షేక్ ఇర్ఫాన్‌కు పురిటి నొప్పులు రాగా, ఆశా కార్యకర్త మల్లేశ్వరి సాయంతో ఈనెల 1న ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. వైద్యులు పరీక్షించి సాధారణ కాన్పు అవుతుందని చెప్పారు. గురువారం అర్ధరాత్రి ఇర్ఫానాకు నొప్పులతోపాటు తీవ్ర రక్తస్రావం జరిగింది. దీంతో వైద్య సిబ్బంది.. డ్యూటీలో ఉన్న వైద్యురాలికి ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వైద్యురాలు ఆస్పత్రికి రాకుండానే సిబ్బందికి ఫోన్లోనే డెలివరీకి సంబంధించిన సూచనలు చేయగా.. వారు చిన్న ఆపరేషన్ చేశారు.
ఈ క్రమంలో ప్రసవం జరగకపోగా.. గర్భిణి అపస్మారక స్థితిలోకి వెళ్లే పరిస్థితి నెలకొంది. విషయం వైద్యురాలికి వివరించడంతో ఆమె ఆస్పత్రికి వచ్చి.. పెద్ద ఆపరేషన్ చేసి బిడ్డను బయటకు తీసింది. మగ శిశువు జన్మించిన వెంటనే మృతిచెందాడు. ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం వల్లే బిడ్డ చనిపోయాడని ఇర్ఫానా భర్త రహమాన్ ఆస్పత్రి సూపరింటెండెంట్ అశోక్‌కుమార్‌కు ఫిర్యాదు చేశారు. బంధువులు ఆస్పత్రి వద్ద ఆందోళన చేపట్టారు. ఇదిలా ఉండగా, శిశువు మృతి ఘటనలో వైద్య సిబ్బంది తప్పేమీ లేదని సూపరింటెండెండ్ అశోక్‌కుమార్ వివరణ ఇచ్చారు. రాత్రి నొప్పులు రావడంతో గైనకాలజిస్ట్ వైద్య సమాచారం ఇచ్చారని, వెంటనే ఆమె ఆస్పత్రికి వచ్చి చికిత్స చేశారన్నారు. కానీ బాబు మృతిచెందాడన్నారు.