రాణిని దేశానికి రప్పించండి
విదేశీవ్యవహారాల శాఖమంత్రికి ఎంపీ పొంగులేటి వినతి
ఖమ్మం: ఖమ్మం జిల్లా జూలూరుపాడు మండలం పడమటనర్సాపురం గ్రామానికి చెందిన జజ్జర రాణి(గీత)ని స్వదేశానికి రప్పించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు, ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కోరారు. ఈ మేరకు కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి సుష్మస్వరాజ్కు శుక్రవారం వినతిపత్రం అందజేశారు. జూలూరుపాడు మండలం పడమట నర్సాపురం గ్రామా నికి చెందిన జజ్జర గోపమ్మ, కృష్ణయ్య దంపతుల నాలుగో కుమార్తె రాణి తన తల్లితో కలిసి 2006లో క్రీస్తు సభల్లో పాల్గొనేందుకు గుంటూరు వెళ్లి అక్కడే తప్పి పోయిందని మంత్రికి వివరించారు.
రాణికి మాటలు రావని, తప్పిపోయే నాటికి ఆమె వయసు కేవలం 10 సంవత్సరాలు మాత్రమేనన్నారు. కొద్దిరోజుల క్రితం ఆమె పాకిస్తాన్లోని కరాచీలో ఈది స్వచ్ఛంద సంస్థ సంరక్షణలో ఉన్నట్లు ఆమె తల్లిదండ్రులకు తెలిసిందన్నారు. దీనిపై స్పందించిన మంత్రి సుష్మాస్వరాజ్ పూర్వాపరాలను పరిశీలించి వీలైనంత త్వరగా రాణిని స్వదేశానికి రప్పించేందుకు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.